ఆధ్యాత్మిక నగరంగా పేరున్న ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ నకిలీ స్వామీజీకి సంబంధించిన వ్యవహారం కలకలం రేపుతోంది.
‘హిమ్మత్ గిరి’ అనే వ్యక్తి స్వామీజీ వేషంలో మహిళలను మోసం చేస్తూ… వారి వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు మహిళలు ఆరోపించారు.
బాధిత మహిళలు, సామాజిక కార్యకర్తల సహకారంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం… ఈ వ్యక్తి సోషల్ మీడియాను తనకు పరిచయాల వేదికగా ఉపయోగించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా పలువురు మహిళలతో పరిచయం పెంచుకుని, ఇందుకోసం వేర్వేరు పేర్లను ఉపయోగించేవాడని బాధితులు తెలిపారు.
తనకు పరిచయమైన మహిళల్లో కొందరిని లక్ష్యంగా చేసుకుని… వారి అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి, అనంతరం వాటిని చూపిస్తూ బెదిరించేవాడని ఆరోపణలు ఉన్నాయి.
“పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోలను బయటపెడతాను” అంటూ బెదిరింపులకు పాల్పడేవాడని కూడా బాధిత మహిళలు ఆరోపించారు.
ఈ వేధింపులు భరించలేక కొందరు మహిళలు విశ్వ హిందూ పరిషత్ (VHP) కార్యకర్తలను ఆశ్రయించినట్లు సమాచారం.
ఆ తర్వాత బాధిత మహిళల్లో ఒకరి ద్వారా అతడిని వృందావన్‌కు రావాలని పిలిచినట్లు తెలుస్తోంది.
ఆహ్వానం మేరకు హిమ్మత్ గిరి వృందావన్లోని చైతన్య విహార్ ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు వెళ్లాడు.
అతడు గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లిన వెంటనే బాధిత మహిళలు, VHP కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడ అతడిపై దాడి జరిగినట్లు సమాచారం.
వైరల్ అవుతున్న వీడియోల్లో కొందరు వ్యక్తులు అతడిని కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హిమ్మత్ గిరిని తమ అదుపులోకి తీసుకున్నారు.
అతడిని కోత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో మహిళలు చేసిన ఆరోపణలు, వ్యక్తిగత వీడియోల వ్యవహారం, బెదిరింపులకు సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలు ఏం జరిగింది? ఎంతమంది మహిళలు బాధితులు? ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమిటి? అనే విషయాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయి.

Leave a Reply