బీహార్ రాష్ట్రంలోని బగాహా ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఒక రైతుపై మొసలి ఒక్కసారిగా దాడి చేసి నీటిలోకి ఈడ్చుకెళ్లిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సెమ్రీడీహ్ గ్రామానికి చెందిన భీమ్ బింద్ అనే వ్యక్తి, ఇంటి నుంచి కొంత దూరంలో ఉన్న పొలానికి వెళ్లారు. అక్కడ కాలకృత్యాలు ముగించుకుని, సమీపంలో ఉన్న ఉపనదిలో నీటిని ముట్టుకోవడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మొసలి ఆయనపై దాడి చేసింది.
మొసలి దాడి చేసి భీమ్ బింద్ను నీటిలోకి ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు ఈ ఘోరాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు, గ్రామస్థులు నదీ తీరంలో ఆయన కోసం తీవ్రంగా గాలించారు. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత మొసలిని అదుపులోకి తెచ్చి భీమ్ బింద్ను బయటకు తీసినప్పటికీ, ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న వాల్మీకినగర్ పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బగాహా ఉప ఆసుపత్రికి తరలించారు. మొసలి దాడిలో వ్యక్తి మృతి చెందడంతో ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో, పరిసర గ్రామాల్లో మొసళ్ల నుంచి రక్షణ చర్యలను పెంచాలని గ్రామస్థులు అటవీ శాఖను, స్థానిక యంత్రాంగాన్ని కోరారు.
గంధక్ నదీ పరివాహక ప్రాంతంలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయని, అవి ఉపనదులు, కాల్వలు మరియు నివాస ప్రాంతాల సమీపంలోకి కూడా వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయం మరింత ఎక్కువైంది.

Leave a Reply