సేలం జిల్లా అత్తూరు సమీపంలోని ఆనైక్కల్ మేడు ప్రాంతానికి చెందిన ఆరుముగం – ముత్తమ్మాళ్ (60) దంపతులకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆరుముగం సాగో (సగ్గుబియ్యం) ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, ముత్తమ్మాళ్ వ్యవసాయ కూలీగా వెళ్లేది. మొదటి నుంచి ముత్తమ్మాళ్ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఆరుముగం, రోజూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో ముత్తమ్మాళ్ వేరే చోట పనులకు వెళ్తున్నప్పటికీ, గత ఏడాదిగా ఆరుముగం అనుమానం తగ్గకపోగా భార్యను కొట్టి హింసించేవాడు.
ఒక దశలో భర్తతో కలిసి పనికి వెళ్తే అతని అనుమానం తీరుతుందని భావించిన ముత్తమ్మాళ్, ఆరుముగం పనిచేసే ఫ్యాక్టరీలోనే పనికి చేరింది. అయినా ఆరుముగం అనుమానం తగ్గకపోవడంతో విసుగు చెందిన ముత్తమ్మాళ్, కొద్ది నెలల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆరుముగం ఎంత బతిమాలినా ఆమె రావడానికి నిరాకరించడంతో, చివరగా బంధువులతో కలిసి వెళ్లి పంచాయితీ పెట్టి.. “ఇకపై అనుమానపడి కొట్టను, పనికి కూడా వెళ్లొద్దు, నాతో ఇంట్లో ఉంటే చాలు” అని బతిమిలాడుకుని, కేవలం 10 రోజుల క్రితమే భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
ఈ క్రమంలో, నిన్న రాత్రి నిద్రిస్తున్న ముత్తమ్మాళ్ను నిద్రలేపిన ఆరుముగం.. “నేనంటే నీకు ఇష్టముందా, లేదా?” అని అడిగి మళ్లీ అసభ్య పదజాలంతో గొడవకు దిగాడు. దానికి ముత్తమ్మాళ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా పడుకుని నిద్రపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆరుముగం, తాను దాచిపెట్టిన యాసిడ్‌ను తీసుకువచ్చి నిద్రిస్తున్న భార్య ముఖంపై పోశాడు. ముత్తమ్మాళ్ కేకలు విని పరుగెత్తుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు, ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అత్తూరు టౌన్ పోలీసులు, భర్త ఆరుముగంను అరెస్టు చేసి ముమ్మరంగా విచారిస్తున్నారు.

Leave a Reply