“చెల్లి కంటి ఆపరేషన్ పేరుతో నెట్టింట లక్షన్నర కొట్టేసిన మోసం!”.. నెటిజన్ల ప్రశ్నలతో ఎక్స్ (X) స్పేస్‌లో బోరున విలపించిన బాలుడు..!!!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) లో, తన 12 ఏళ్ల చెల్లెలికి కంటి శస్త్రచికిత్స చేయాలని చెబుతూ నకిలీ వైద్య ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేసి, ఒక్క రోజులోనే రూ. 1.5 లక్షలకు పైగా డబ్బు వసూలు చేసిన జైసింగ్ రాథోడ్ అనే బాలుడి మోసకారి వ్యవహారం నెట్టింట తీవ్ర కలకలం, దుమారం రేపింది.

16 ఏళ్ల బాలుడిగా తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, తన చెల్లెలు కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉందని, తదుపరి చికిత్స కోసం డబ్బు అవసరమని పేర్కొంటూ ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను పెట్టాడు. అది నిజమని నమ్మిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించి అతనికి ఆర్థిక సహాయం పంపారు.

కానీ, ఆ పోస్ట్‌లో పేర్కొన్న ఢిల్లీలోని ప్రముఖ ష్రాఫ్ (Shroff) కంటి ఆసుపత్రి యాజమాన్యం జారీ చేసిన హెచ్చరిక ప్రకటనతో కథ మొత్తం అడ్డం తిరిగింది. తమ ఆసుపత్రి లెటర్ ప్యాడ్, స్టాంపును ఉపయోగించి ఎవరో నకిలీ రోగి వివరాలను, మెడికల్ బిల్లులను సృష్టించి డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంతో, మోసపోయామని గ్రహించిన నెటిజన్లు ఎక్స్ స్పేస్ (X Space) లైవ్‌లో ఆ బాలుడిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తీవ్ర ఒత్తిడికి లోనైన ఆ బాలుడు లైవ్‌లోనే కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, తాను చేసింది తప్పేనని, చెల్లెలి పేరు చెబితేనే ఎక్కువ ఆర్థిక సహాయం వస్తుందనే ఉద్దేశంతోనే అలా చేశానని తన తప్పును అంగీకరించాడు.

అంతేకాకుండా, వాస్తవానికి తన తండ్రికి ఆరోగ్యం బాలేదని, ఎవరినీ మోసం చేసి డబ్బులు లాక్కోవాలనే ఉద్దేశంతో తాను ఇలా చేయలేదని చెబుతూ, వసూలు చేసిన డబ్బును అందరికీ విడతలవారీగా తిరిగి ఇచ్చేస్తున్నానని తెలిపాడు. ఇతరుల అత్యవసర అవసరాలను, మానవత్వాన్ని నమ్మి ఆపదలో ఉన్నారని ఆర్థిక సహాయం చేసిన ప్రజలను, నకిలీ సర్టిఫికెట్లతో మోసం చేసిన ఈ ఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *