మహారాష్ట్రలోని భివండీ నగరంలో చోటుచేసుకున్న ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుట్టించింది.
దేశ భవిష్యత్తు అయిన పసిపిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే ఆటోలలో కనిపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ప్రస్తుతం సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది.
భివండీలోని రోషన్ బాగ్ ప్రాంతంలో ఓ సాధారణ ఆటో ఎప్పటిలాగే వెళ్తోంది. కానీ, ఆ వాహనం లోపల ఉన్న దృశ్యం మాత్రం ఎవరూ నమ్మలేని విధంగా ఉంది. కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆ చిన్న ఆటోలో, నిబంధనలను బేఖాతరు చేస్తూ 17 మంది పాఠశాల విద్యార్థులు వంగి, ఇరుక్కుని కూర్చున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో పిల్లల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉంది. డ్రైవర్ సీటు చుట్టూ పసిపిల్లలను కిక్కిరిసి కూర్చోబెట్టారు. వెనుక సీట్లో అయితే 6 నుంచి 7 మందిని ఊపిరాడకుండా ఇరికించారు. వీటన్నింటికీ మించి, ఆటో వెనుక భాగంలో లగేజీ పెట్టే స్థలంలో (డిక్కీలో) కూడా ఇద్దరు, ముగ్గురు పిల్లలను కుక్కేశారు.
ఇంతటి ప్రమాదకరమైన ప్రయాణాన్ని గమనించిన అక్కడి వ్యక్తి ఒకరు, వెంటనే దానిని తన సెల్ఫోన్లో రికార్డ్ చేయగా.. ఆ వీడియో ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపించి సోషల్ మీడియాను కుదిపేసింది. ఒకవేళ ఆ సమయంలో ఏదైనా ప్రమాదమో లేదా అత్యవసర పరిస్థితో తలెత్తితే, ఆ చిన్న పిల్లలు అందులో నుంచి కనీసం బయటకు కూడా రాలేరనేది చేదు నిజం.
ఈ ఘటన వెనుక ఉన్న మరో కోణం.. తల్లిదండ్రుల పేదరికం, నిస్సహాయత. చాలా పాఠశాలల్లో సరైన బస్సు సౌకర్యాలు ఉండవు. ఒకవేళ ఉన్నా, వాటికి వసూలు చేసే అధిక ఫీజులను మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు భరించలేవు. దీంతో మరో మార్గం లేక తక్కువ ఖర్చుతో పిల్లలను బడికి పంపేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
అయితే, తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనుకునే తల్లిదండ్రుల ఈ నిస్సహాయతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు ఆటో డ్రైవర్లు.. పిల్లలను డబ్బులు కురిపించే యంత్రాలుగా భావిస్తూ, ఇలా ఒకే ఆటోలో అసహ్యం కలిగించే స్థాయిలో పిల్లలను కుక్కి తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. కొన్నిసార్లు పిల్లలను పాఠశాల లోపల దింపకుండా, ప్రమాదకరంగా జాతీయ రహదారులపైనే దింపేసి వెళ్తున్న దుస్థితి కూడా నెలకొంది.
ఈ వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, ఆ ఆటో డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకున్నారు. అయితే, భివండీలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply