బిడ్డ ఏడవడంతో క్లాస్ నుంచి బయటకు వెళ్లబోతున్న విద్యార్థిని.. వెంటనే బిడ్డను ఎత్తుకున్న ప్రొఫెసర్.. చేతుల్లోనే పట్టుకుని పాఠం చెప్పిన వైనం!
అమెరికాలోని ఓ కాలేజీలో జరిగిన మానవత్వానికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాస్‌కు తన చిన్నారితో వచ్చిన ఓ విద్యార్థినికి ఇబ్బంది కలగకుండా.. 67 ఏళ్ల ప్రొఫెసర్ స్వయంగా బిడ్డను ఎత్తుకుని క్లాస్ కొనసాగించారు.
తన చిన్నారిని చూసుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో ఓ తల్లి తన బిడ్డను వెంట తీసుకుని కాలేజీకి వచ్చింది. క్లాస్ జరుగుతున్న సమయంలో చిన్నారి ఒక్కసారిగా గట్టిగా ఏడవడం ప్రారంభించింది.
దీంతో ఇతర విద్యార్థుల దృష్టి మరలిపోతుందేమోనని భావించిన ఆ తల్లి.. బిడ్డను ఎత్తుకుని క్లాస్రూమ్ నుంచి బయటకు వెళ్లేందుకు తలుపు వైపు నడిచింది.
అది గమనించిన 67 ఏళ్ల ప్రొఫెసర్ సిడ్నీ ఎంగెల్బర్గ్ వెంటనే తన బోధనను ఆపి, విద్యార్థి వద్దకు వెళ్లారు. ఆమె చేతుల్లో ఉన్న చిన్నారిని స్వయంగా తీసుకున్నారు.
ఆ తర్వాత చిన్నారిని తన చేతుల్లో ఎత్తుకుని, క్లాస్‌ను యథావిధిగా కొనసాగించారు.
ప్రొఫెసర్ ఒడిలోకి వెళ్లిన చిన్నారి కూడా కొద్దిసేపటికే ఏడుపు ఆపి ప్రశాంతంగా నిద్రపోయింది.
ఈ ప్రొఫెసర్‌కు బోధనా రంగంలో 45 ఏళ్ల అనుభవం ఉందని, ఆయనకు ఐదుగురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని కథనంలో పేర్కొన్నారు.
విద్యార్థిని పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆమెను ఇబ్బందికి గురిచేయకుండా స్వయంగా చిన్నారిని చూసుకుంటూ క్లాస్ కొనసాగించిన ప్రొఫెసర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
“ప్రొఫెసర్ అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు.. అవసరమైనప్పుడు విద్యార్థులకు అండగా నిలిచేవారు కూడా” అంటూ నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు.

Leave a Reply