కర్ణాటక రాష్ట్రం విరాజ్‌పేటలో జరిగిన వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులో, ఊహించని విధంగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘటన పెను విషాదాన్ని నింపింది.
శుక్రవారం అర్ధరాత్రి అలంకరించిన రథాలు, డీజే వాహనాలతో ఊరేగింపు వెళ్తుండగా, వాహనంపై ఉన్నవారికి ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
విద్యుదాఘాతానికి గురై వాహనంపై ఉన్న ఐదుగురు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి దుస్తులకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరో ఇద్దరు ఘటనా స్థలంలోనే స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిలో హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతానికి చెందిన బసవరాజు సహా ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, వారిని హుటాహుటిన మైసూర్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో (ICU) చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురు మడికేరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఆర్.ఎన్. బిందుమణి, పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, విరాజ్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ.ఎస్. పొన్నన్న వెంటనే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరాமర్శించి ధైర్యం చెప్పడంతో పాటు, వారికి అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply