రోడ్డుపై ఉంచిన ట్రాఫిక్ కోన్లను (Traffic Cones) బైక్ వెనుక సీట్లో కూర్చుని కాలితో తన్నుకుంటూ వెళ్లిన యువతుల వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి, ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ఇలాంటి బాధ్యతారహితమైన చర్యపై పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ముగ్గురు యువతులు ఒకే బైక్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో, బైక్ చివరి సీట్లో కూర్చున్న యువతి.. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి రోడ్డు మధ్యలో ఉంచిన ఆ ఎరుపు రంగు ట్రాఫిక్ కోన్లను కాలితో తన్నుకుంటూ పడేస్తూ వెళ్తోంది.
ఆ యువతి అలా కాలితో తన్ని పడేయడంతో, ఆ కోన్లు ఎదురుగా వేగంగా వస్తున్న వాహనాలకు అడ్డంగా పడ్డాయి. దీనివల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులు అదుపుతప్పి పెను ప్రమాదంలో చిక్కుకునే ముప్పు ఏర్పడింది. దీనిని వెనుక వస్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇలా చేయడం ఏం మనస్తత్వం?’ అని, ‘ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ప్రజల భద్రత కోసం రోడ్డుపై ఉంచిన వస్తువులను ధ్వంసం చేసిన ఆ యువతులను గుర్తించి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, వారికి కఠిన శిక్షతో పాటు 1,000 గంటల సమాజ సేవ (Community Service) చేయాలని ఆదేశించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

Leave a Reply