“నీకు వెళ్లడానికి వేరే చోటే దొరకలేదా?”.. ఇంట్లోకి దూరిన సింహం!

ఇంట్లోకి సింహం దూరి.. ఏకంగా కిచెన్ నుంచి బాత్‌రూమ్ వరకు చుట్టూ తిరిగిన ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా తితల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గిర్ అడవులకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో.. ఆహారం కోసం సంచరిస్తున్న ఓ సింహం ఒక్కసారిగా జనావాసాల్లోకి ప్రవేశించింది.

మొదట వ్యవసాయ పొలాల్లో తిరిగిన సింహం.. అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి తెరిచి ఉన్న గేటు ద్వారా లోపలికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత గదుల్లో తిరుగుతూ.. చివరకు బాత్‌రూమ్‌ ప్రాంతానికి కూడా వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఇంట్లో సింహం తిరుగుతున్న దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సింహం జనావాసాల్లోకి వచ్చిందనే విషయం తెలియడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.

గిర్ అటవీ ప్రాంతానికి సమీపంలో తితల్ గ్రామం ఉండటంతో.. అడవి జంతువులు అప్పుడప్పుడు జనావాసాల్లోకి రావడం అక్కడ కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఏకంగా ఓ ఇంట్లోకి సింహం ప్రవేశించడంతో స్థానికుల్లో మరింత ఆందోళన నెలకొంది.

ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరూ సింహానికి లేదా ఇతర అడవి జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

అలాగే.. ఇళ్ల సమీపంలో సింహం సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇక ఇంట్లోకి దూరిన సింహం.. ఏ మాత్రం భయపడకుండా ఇంట్లోని గదులు, బాత్‌రూమ్‌ చుట్టూ తిరిగి చివరకు దర్జాగా కూర్చున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *