కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో కొండచిలువను పట్టుకుని, దాన్ని చంపి ముక్కలుగా నరికి వండుకుని తిన్న ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులు అరెస్టయ్యారు.
మన్నమంగళం సమీపంలోని చెరుకున్ను ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిని జిన్సన్ జోస్ (36), జిష్ణు (30), వివేక్ (30) గా గుర్తించారు. శుక్రవారం రాత్రి నిందితుల్లో ఒకరి ఇంటి సమీపంలో కొండచిలువ కనిపించింది. దీంతో ఆ ముగ్గురు స్నేహితులు కలిసి ఆ కొండచిలువను పట్టుకున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది.
ఆ తర్వాత పట్టుకున్న కొండచిలువను చంపి, ముక్కలుగా కోసి కూర వండుకుని తిన్నట్లు తెలుస్తోంది. దీనిపై అటవీ శాఖకు సమాచారం అందడంతో, మన్నమంగళం ఫారెస్ట్ స్టేషన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం. షాజహాన్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. అనంతరం ఆ ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, కేరళలోని కన్నూర్ జిల్లాలోనూ కొండచిలువను వేటాడి వండుకుని తిన్న కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. పనప్పుళా ప్రాంతంలోని రబ్బరు తోటలో ఓ పెద్ద కొండచిలువను పట్టుకున్న ప్రమోద్, బినిష్ అనే ఇద్దరిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొండచిలువను చంపి ప్రమోద్ ఇంట్లో కూర వండుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు చెప్పారు. ఆ ఇంట్లో జరిపిన తనిఖీల్లో పాము శరీర భాగాలను, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. త్రిసూర్‌లో అరెస్టయిన ముగ్గురు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా, కొండచిలువను వేటాడి తిన్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సంరక్షిత వన్యప్రాణులను వేటాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అటవీ శాఖ, ఇటువంటి ఘటనలపై నిఘాను మరింత ముమ్మరం చేసింది.

Leave a Reply