చెరువు ఒడ్డున ఆవులు ప్రశాంతంగా నీళ్లు తాగుతుండగా, ఊహించని విధంగా ఓ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది.
ఆవుల మధ్య నిలబడి ఉన్న ఓ కుక్కను, నీటిలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన మొసలి నోటితో పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది చూసి షాక్కు గురైన ఆవులు భయంతో అరుస్తూ నలువైపులా చెల్లాచెదురుగా పరుగులు తీశాయి.
ఆ కుక్క మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడటం చూసిన పక్కనే ఉన్న మరో శునకం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆపదలో ఉన్న తోటి కుక్కను కాపాడేందుకు వేగంగా పరుగెత్తుకొచ్చింది. ఏమాత్రం భయపడకుండా నేరుగా వెళ్లి ఆ మొసలిని ధైర్యంగా కరవడం మొదలుపెట్టింది.
ఆ కుక్క ఊహించని దాడికి, తెగువకు మొసలి బెదిరిపోయింది. చేసేదేమీ లేక తాను పట్టుకున్న కుక్కను వదిలేసి, వెంటనే నీటిలోకి జారుకుంది. ఏకంగా మొసలినే ఎదిరించి, కరిచి తరిమికొట్టి తన తోటి శునకాన్ని కాపాడుకున్న ఈ కుక్క సాహసాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply