ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పూర్వీకుల ఆస్తి తగాదాల నేపథ్యంలో, ఓ కూతురు తన ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుమార్తెను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
రాయ్వాలాలోని మోతీచూర్ ప్రాంతానికి చెందిన గజానీ దేవి (65) అనే వృద్ధురాలు గత సెప్టెంబర్ 21 నుంచి కనిపించకుండా పోయారు. తాళం వేసి ఉన్న ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఆమె బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ (CCTV) దృశ్యాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో గజానీ దేవికి, ఆమె కుమార్తె శిల్పా థాపాకు మధ్య పూర్వీకుల ఆస్తి పంపకాల విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తేలింది. అంతేకాకుండా, ఘటన జరిగిన రోజు శిల్పా ప్రియుడు శివనారాయణ్ పాండే ఆ ఇంటి పరిసరాల్లో సంచరించడం, ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం పోలీసులకు అనుమానం కలిగించింది.
దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, హరిద్వార్‌లోని ఓ ఆశ్రమంలో తలదాచుకున్న శివనారాయణ్ను సెప్టెంబర్ 25న అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా, హత్యకు కుట్ర పన్నిన కుమార్తె శిల్పా థాపాను కూడా మరుసటి రోజే అరెస్టు చేసి జైలుకు తరలించారు.
తల్లి గజానీ దేవి తనకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా భూమిని అమ్మేందుకు ప్రయత్నించడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి శిల్పా పథకం వేసింది. ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 21న వృద్ధురాలి ఇంటికి వెళ్లిన శివనారాయణ్, ఆమెను హత్య చేసి ఇంటికి బయట నుంచి తాళం వేసి పరారైనట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

Leave a Reply