బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు, రైలులో తప్పిపోయి సుమారు 21 సంవత్సరాల తర్వాత ఫేస్బుక్ వీడియో ద్వారా తన కుటుంబంతో తిరిగి కలిశాడు.
బీహార్‌కు చెందిన రామ్ శంకర్ కుష్వాహాకు చిన్నప్పటి నుంచే రైలు ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. గత 2005వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన గ్రామంలో జాతర జరుగుతున్న సమయంలో, అక్కడికి వచ్చిన ఓ సాధువు మాటలు విని రైలు ఎక్కాడు. అయితే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే ఇంటి నుంచి బయటకు వెళ్లి దారి తప్పిపోయాడు.
ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చేరుకున్న అతను, అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలోనే చాలా రోజుల పాటు ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపాడు. గత 2018లో ఓ అనాథాశ్రమంలో చేరిన అతను, గత కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో, ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గ్వాలియర్ డీఎస్పీ సంతోష్ పటేల్.. శంకర్‌తో మాట్లాడి, ఆ సంభాషణను వీడియో తీసి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోను బీహార్‌లో చూసిన శంకర్ అన్న లలిత్, వెంటనే ఆ వీడియోలో ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించి తన తమ్ముడిని గుర్తించాడు.
శంకర్ తల్లి కూడా తన కొడుకు ముఖాన్ని వెంటనే గుర్తుపట్టడంతో, తప్పిపోయిన కుమారుడిని 21 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలతో తిరిగి ఆహ్వానించారు. తమ కుమారుడి కోసం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా, అతను ఏదో ఒక రోజు కచ్చితంగా తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రుల నమ్మకం ఎట్టకేలకు నిజమైంది.

Leave a Reply