ఢిల్లీలో రోడ్డు పనుల నాణ్యత విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ మరియు మంత్రి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న నేపథ్యంలో, అక్కడి పరిస్థితిని వీడియో తీస్తున్న ఓ యువకుడిని మంత్రి చెంపపై కొట్టినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి చేసిన ఈ పనితో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం, ఉద్రిక్తత నెలకొన్నాయి.
మంత్రి పర్వేష్ వర్మ రోడ్డు పనులను స్వయంగా తనిఖీ చేస్తున్న సమయంలో, స్థానికులు మరియు ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రోడ్డు నాణ్యత సరిగా లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా, దెబ్బతిన్న రోడ్డు భాగాన్ని చేతులతో పెకిలించి చూపిస్తూ పనుల నాణ్యత ఎంత అధ్వాన్నంగా ఉందో వారు ఎత్తిచూపారు. దీంతో మంత్రి మరియు ఎమ్మెల్యే మద్దతుదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి పరిస్థితి అదుపుతప్పే స్థాయికి చేరుకుంది.
ఈ పరిణామాలను ఓ యువకుడు తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుండగా.. ఆగ్రహానికి గురైన మంత్రి ఆ యువకుడి చేతిలోని మొబైల్ ఫోన్ను పక్కకు కొట్టేసి, అతడి చెంపపై కొట్టినట్లు ఆ వైరల్ వీడియోలో రికార్డయింది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఆ యువకుడిని, అక్కడున్న ప్రజలను అక్కడి నుంచి తరలించారు.
తాను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వ్యవహారాలను చూసుకుంటానని, అధికారుల ఆహ్వానం మేరకే అక్కడికి వచ్చానని దాడికి గురైన యువకుడు తెలిపాడు.
మరోవైపు, మంత్రిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో పాటు, సంబంధిత ప్రదేశానికి స్వయంగా వెళ్లి తాను కూడా తనిఖీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.

Leave a Reply