ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంత పరిధిలో ఉన్న సహస్రధార రోడ్డులో, గత సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 6:50 గంటల సమయంలో సుష్మా వర్మ అనే మహిళను నల్లటి స్విఫ్ట్ కారులో కిడ్నాప్ చేసేందుకు జరిగిన ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది.
ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో, స్థానికులు గుమికూడటంతో కిడ్నాప్ ముఠా అక్కడి నుండి పరారైంది.
ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో, డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఆదేశాల మేరకు పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం సంయుక్తంగా ముమ్మర విచారణ చేపట్టాయి. ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, దీని వెనుక ఉన్న షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. చాహత్ అలియాస్ అన్నూ, దీపక్ పాశ్వాన్ కలిసి వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం అత్తూర్‌వాలా భనియావాలా ప్రాంతంలో సుష్మా వర్మ అనే మహిళ వద్ద 11 ఆవులు ఉన్న పాల కేంద్రాన్ని (డైరీ ఫామ్) రూ.7,50,000కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు నగదు, రూ.2.5 లక్షలకు చెక్ ఇచ్చారు.
ఈ ఆవులు రోజుకు 150 లీటర్ల పాలు ఇస్తాయని హామీ ఇచ్చినప్పటికీ, డైరీ ఫామ్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పాల దిగుబడి చాలా తక్కువగా ఉంది. దీంతో మోసపోయామని భావించిన వారు, సుష్మాను తాము ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరింది.
ఈ డబ్బు వివాదం కారణంగా సుష్మాను బెదిరించేందుకు, కార్గి చౌక్ ప్రాంతం నుండి ఓ నల్లటి స్విఫ్ట్ కారును అద్దెకు తీసుకున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం సహస్రధార రోడ్డులో సుష్మాను అడ్డగించి కారులో ఎక్కించడానికి ప్రయత్నించగా, ఆమె కేకలు వేయడంతో ప్రమాదం నుండి బయటపడింది.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా, సెప్టెంబర్ 26న 19 ఏళ్ల చాహత్ అలియాస్ అన్నూను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో పరారీలో ఉన్న దీపక్, సుశాంత్ అలియాస్ లక్కీ, ఆదిత్య వశిష్ట్, ప్రియాన్షు అనే నలుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Leave a Reply