ప్రశ్నిస్తే చేయి చేసుకుంటారా..? “ముట్టుకుంటేనే తారు రోడ్డు ఊడి వస్తోంది”.. ఆధారాలతో నిరూపించిన ఎమ్మెల్యే సహాయకుడిపై మంత్రి దాడి.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..!

ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలించడానికి వచ్చిన ప్రజా పనుల శాఖ (PWD) మంత్రి పర్వేశ్ వర్మ.. రోడ్డు నాణ్యతపై నిలదీసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తపై బహిరంగంగా దాడి చేసిన ఘటన ప్రస్తుతం రాజధానిలో పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

ఈరోజు తిలక్ నగర్‌లో కొత్తగా వేసిన రోడ్డు నాణ్యతను పరిశీలించేందుకు ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ తన బృందంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో, పీడబ్ల్యూడీ అధికారుల ఆహ్వానం మేరకు తిలక్ నగర్ నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సాహిల్ కూడా అక్కడికి వచ్చారు.

తనిఖీ సమయంలో, కొత్తగా వేసిన రోడ్డు ఎంత నాసిరకంగా ఉందో మంత్రి కళ్ల ముందే సాహిల్ చూపించారు. చేతితో తాకగానే తారు రోడ్డు పెచ్చులూడి వస్తుండటాన్ని ఆయన ప్రత్యక్షంగా చేసి చూపించడంతో పాటు, దాన్ని తన మొబైల్ ఫోన్‌లో వీడియో కూడా తీశారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి పర్వేశ్ వర్మ, సాహిల్ చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, మంత్రి వెంట వచ్చిన వారు కూడా సాహిల్‌కు ప్రాణహాని తలపెడతామని బెదిరించినట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. దీనిపై వార్తా సంస్థతో మాట్లాడిన సాహిల్.. ‘రోడ్డు దుస్థితిని చూపించడాన్ని మంత్రి తట్టుకోలేకపోయారు. నాపై చేయి చేసుకుని కొట్టారు. ఆయనతో పాటు ఉన్నవారు కూడా నన్ను బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలంలో వికాస్‌పురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సహా ఇతర పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. అయితే, మంత్రిని అరెస్ట్ చేయకుండా పోలీసులు చోద్యం చూశారని, ఘటన తర్వాత మంత్రి పర్వేశ్ వర్మ అక్కడి నుండి వెళ్లిపోయారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఆరోపించారు.

దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు 112 అత్యవసర సహాయ నంబర్‌కు ఫోన్ చేసి, మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రోడ్డు నాణ్యతపై సమాధానం చెప్పలేక, దాన్ని వీడియో తీసిన వ్యక్తిపై మంత్రి దౌర్జన్యానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఢిల్లీ ఆప్ (AAP) నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తూ తీవ్ర కలకలం రేపుతుండగా, సంబంధిత మంత్రిపై కేసు నమోదు చేసినట్లు సాహిల్ తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *