పిల్లిలా ప్రవర్తించిన చిన్నారి.. రేబిస్ అని భయపడిపోయిన కుటుంబం.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటి..?

బంగ్లాదేశ్‌లోని కుష్టియా ప్రాంతంలో ఉన్న భేరామారా అనే ప్రదేశంలో, 5 ఏళ్ల చిన్నారిని పెంపుడు పిల్లి రక్కిన తర్వాత, ఆ పాప ఒక్కసారిగా పిల్లిలాగే ‘మియావ్ మియావ్’ అంటూ శబ్దాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం, దిగ్భ్రాంతిని రేపింది.

చిన్నారికి రేబిస్ (Rabies) వ్యాధి సోకి ఉండవచ్చనే భయంతో ఈ వీడియో దావానలంలా వ్యాపించింది. అయితే, ఈ ఘటనపై వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చిన్నారి ఈ వింత ప్రవర్తనకు, రేబిస్ వ్యాధికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా నిర్ధారించారు.

సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఆ చిన్నారి తల్లి విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా ఆ చిన్నారి జలుబు, ఆస్తమా సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో పెంచుకుంటున్న రెండు పిల్లులు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో, ఆ పాప తీవ్ర మానసిక ఒత్తిడికి, ‘పానిక్ అటాక్’ (Panic Attack) అని పిలిచే తీవ్ర భయాందోళనకు గురైంది. అంతకుముందు పిల్లి రక్కినప్పుడే చిన్నారికి, పిల్లికి సరైన వ్యాక్సిన్లు వేయించారనే విషయం గమనించదగ్గది.

కుష్టియా జనరల్ ఆసుపత్రిలో చేరిన చిన్నారిని, మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని మొహాఖాలీ (మహాకాళి) అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. అక్కడ క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఇది రేబిస్ వ్యాధి కాదని, పిల్లలు తీవ్ర భయానికి లేదా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే ఒక రకమైన మానసిక ప్రతిచర్య (Psychological reaction) మాత్రమేనని వైద్యులు స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఛాతీ ఎక్స్-రే పరీక్ష ఫలితాల తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఆమె ఇంటికి తిరిగి వస్తుందని సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *