చెన్నై మాంగాడు సమీపంలోని కొళుమణివాక్కం ప్రాంతానికి చెందిన విక్కీ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆ యువతి సెల్‌ఫోన్‌కు ‘యువనేష్’ అనే యువకుడు తరచూ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన ఆ యువతి, ఈ విషయాన్ని తన ప్రియుడు విక్కీకి చెప్పి వాపోయింది. వెంటనే ఆ ఫోన్ నంబర్ ఎవరిదా అని ఆరా తీసిన విక్కీకి కోలుకోలేని షాక్ తగిలింది. ప్రియురాలికి అసభ్యకర మెసేజ్‌లు పంపి వేధిస్తున్నది మరెవరో కాదు.. విక్కీతో పాటు ఒకే పాఠశాలలో చదువుకుని పెరిగిన అతని ప్రాణస్నేహితుడు యువనేష్!
ప్రాణస్నేహితుడే తన ప్రియురాలికి ఇలాంటి మెసేజ్‌లు పంపాడని తెలుసుకున్న విక్కీ కోపంతో ఊగిపోయాడు. వెంటనే తన మరో స్నేహితుడైన పార్థిబన్‌ను వెంటబెట్టుకుని వెళ్లి, యువనేష్ను నేరుగా కలిసి నిలదీశాడు.
మాటామాటా పెరిగి గొడవ ముదరడంతో, కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన విక్కీ, పార్థిబన్ కలిసి యువనేష్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువనేష్ ఘటనా స్థలంలోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు.
స్నేహితుడు చనిపోయాడని గ్రహించిన వారిద్దరూ భయపడిపోయి, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి యువనేష్ మృతదేహానికి పెద్ద రాయి కట్టి సమీపంలోని బావిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆ తర్వాత భయంతో వారిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారుల ఎదుట లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బావిలో నుంచి యువనేష్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
చిన్ననాటి స్నేహితుడినే కోపంతో కొట్టి చంపి బావిలో పడేసిన విక్కీని, అతనికి సహకరించిన పార్థిబన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని లోతుగా విచారిస్తున్నారు. ప్రియురాలికి పంపిన అసభ్యకర మెసేజ్‌ల కారణంగా స్నేహితుడి ప్రాణమే పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది!

Leave a Reply