అక్టోబర్ 7, 2023… ఇజ్రాయెల్ చరిత్రలో మర్చిపోలేని ఒక చీకటి రోజు. ఆ రోజు ‘నోవా మ్యూజిక్ ఫెస్టివల్’లోకి చొరబడి హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం, అమాయక ప్రజలను బందీలుగా కిడ్నాప్ చేసిన ఘటన ప్రపంచాన్నే కుదిపేసింది.
ఆ రోజు కిడ్నాప్‌కు గురైన వారిలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఇద్దరు – నోవా అర్గమాని (Noa Argamani), అవినాథన్ ఓర్ (Avinatan Or). నోవా అర్గమానిని ఒక మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టి, ఆమె భయంతో కేకలు వేస్తుండగా గాజా వైపు బందీగా తీసుకెళ్తున్న వీడియో అంతర్జాతీయ మీడియాలో ప్రసారమై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆమె ప్రియుడు అవినాథన్ ఓర్‌ను ఉగ్రవాదులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
ఆ బైక్ నడిపిన వ్యక్తే ‘సాగర్ నిడాల్ సాగర్’ అనే ఉగ్రవాది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడి ఈ కిడ్నాప్ పర్వాన్ని నడిపించడంలో ఇతనిది ప్రధాన పాత్ర. యుద్ధం జరిగిన సమయంలో కూడా హమాస్ సంస్థకు ఆయుధాలు సరఫరా చేసిన ఇతను, ఇటీవల ఇజ్రాయెల్ సైనికులు, సాధారణ ప్రజలపై మళ్లీ భారీ స్థాయిలో దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నాడు.
ఈ క్రమంలో, గత సెప్టెంబర్ 26న గాజా స్ట్రిప్‌లోని నుసెయిరత్ ప్రాంతంలో నక్కి ఉన్న సాగర్ నిడాల్ సాగర్‌ను ఇజ్రాయెల్ భద్రతా దళాలు పక్కా సమాచారంతో చుట్టుముట్టి హతమార్చాయి.
ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF), షిన్ బెట్ (Shin Bet) నిఘా సంస్థ, పోలీసు ప్రత్యేక విభాగమైన ‘గిడోనిమ్ యూనిట్ 33’ సంయుక్తంగా ఈ రహస్య మెగా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. డ్రోన్ ద్వారా ఆ ఉగ్రవాది ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూ, సరైన సమయంలో వైమానిక దాడి జరిపి అతడిని మట్టుబెట్టిన షాకింగ్ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు తాజాగా విడుదల చేశారు.
ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, కిడ్నాప్‌కు గురైన యువతి నోవా అర్గమానిని గత 2024లో ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ప్రత్యేక రెస్క్యూ బృందం సురక్షితంగా రక్షించింది. అవినాథన్ ఓర్ 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కింద విడుదలయ్యాడు.
‘అక్టోబర్ 7 నాటి భీకర దాడిలో పాల్గొన్న నేరస్తులు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా సరే, వారిని వెతికి పట్టుకుని అంతమొందిస్తాం’ అనే తమ విధానంలో ఇజ్రాయెల్ ఎంత దృఢంగా ఉందో ఈ మెరుపు దాడి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది!

Leave a Reply