పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై అధికారిక విచారణ జరుగుతుండగా, యూనివర్సిటీ యాజమాన్యం విడుదల చేసిన వివరణ వీడియో ప్రస్తుతం మరో వివాదానికి దారితీసింది.
హాస్టల్లోని ఒక గదిలో ఉంటున్న విద్యార్థినులను యూనివర్సిటీ రిజిస్ట్రార్ వివరణ అడుగుతున్నట్లుగా ఉన్న ఓ వీడియోను యూనివర్సిటీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. తమకు తెలిసినంత వరకు అక్కడ ఎలాంటి అঘాయిత్యం జరగలేదని ఆ వీడియోలో విద్యార్థినులు చెప్పారు. అయితే, ఆ వీడియోలో కనిపించిన విద్యార్థులు ఆ తర్వాత విడిగా మరో వీడియో విడుదల చేస్తూ.. తాము ఏం మాట్లాడాలో ముందే నిర్దేశించారని, తమ అనుమతి లేకుండానే వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు.
కొన్ని విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మాట్లాడాలని తమకు సూచించినట్లు ఒక విద్యార్థి తెలిపారు. అంతేకాకుండా, తాము రికార్డు చేసిన వీడియోలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే వాడుకున్నారని, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు తమ అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. మరో విద్యార్థి స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఘటనకు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వివాదంలోకి తమను అనవసరంగా లాగొద్దని కోరారు.
మరోవైపు, హాస్టల్లో నిర్మాణ పనులు చేస్తున్న ఓ కార్మికుడు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంత అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల ఆరోపణలు, యూనివర్సిటీ వివరణలు, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు.. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో, పూర్తిస్థాయి విచారణ తర్వాతే అసలు నిజం బయటపడుతుందని అధికారులు వెల్లడించారు.

Leave a Reply