అస్సాంలోని గువాహటి యూనివర్సిటీలో చదువుతున్న నిమిషా ఠాకూరియా నగర శివారులోని ఓ హోమ్‌స్టేలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి నిమిషాకు పరిచయస్తుడైన 26 ఏళ్ల ఆశిక్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఘటనకు ముందు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నిమిషా తన తల్లికి ఫోన్ చేసింది. ఆ సమయంలో తనను కొందరు కొట్టారని, ఛాతిలో పొడిచారని ఆమె చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ ఫోన్ కాల్ తర్వాత నిమిషాతో మళ్లీ సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు నిమిషా హోమ్‌స్టేలో ఉంటున్న విషయం కుటుంబ సభ్యులకు ముందుగా తెలియదని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమిషా, ఆశిక్ అలీ కలిసి తారాపూర్-కరల్ ప్రాంతంలోని ఓ హోమ్‌స్టేలో ఉన్నారు.
ఘటన తర్వాత ఆశిక్ పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్న సమాచారంలో.. నిమిషా ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
అయితే అసలు ఏం జరిగిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆశిక్ చెప్పిన వివరాలు నిజమా? ఘటన ఎలా జరిగింది? అనే అంశాలను పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఘటన జరిగిన గదిలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. నిమిషా, ఆశిక్ గతంలో కూడా పలుమార్లు ఈ హోమ్‌స్టేకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
అంతేకాదు.. సరైన గుర్తింపు పత్రాల పరిశీలన లేకుండానే వారిని అక్కడ బస చేసేందుకు అనుమతించినట్లు కూడా పోలీసులు తెలిపారు. దీంతో హోమ్‌స్టే నిర్వహణపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తన తల్లికి తెల్లవారుజామున ఫోన్ చేసి సహాయం కోరినట్లు చెబుతున్న విద్యార్థిని.. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది.
ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? నిమిషా మరణానికి కారణం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply