“జనాలు ఏమనుకుంటారు?” అనే సమాజపు ప్రశ్నలను పట్టించుకోకుండా, తన తల్లిని చూసుకోవడం కోసం ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి ఆటో నడుపుతున్న ఒక మహిళ ఆత్మవిశ్వాస కథ అంతర్జాలంలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది.
బెంగళూరు వీధుల్లో ర్యాపిడో (Rapido) ద్వారా ఆటో నడుపుతున్న ఈమెను చూసేవారు, కేవలం జీవనోపాధి కోసం మాత్రమే ఆమె ఈ పని చేస్తోందని అనుకోవచ్చు. కానీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న హృదయాన్ని హత్తుకునే కారణాన్ని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన్వి పంచుకున్న వీడియో వెలుగులోకి తెచ్చింది.
తన్వి తన ర్యాపిడో ప్రయాణంలో ఆ మహిళతో మాట్లాడినప్పుడు, ఆమె గతంలో ఐటీ రంగంలో పని చేసిందని తెలిసింది. తండ్రి మరణం తర్వాత తల్లి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై పడింది. దీంతో రాత్రి వేళల్లో ఐటీ ఉద్యోగం చేయడం ఆమెకు కష్టంగా మారింది. అందుకే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించగలిగే ఆటో నడిపే వృత్తిని ఎంచుకుంది.
ప్రారంభంలో ఆమె కుటుంబ సభ్యులు దీనికి వ్యతిరేకించినప్పటికీ, ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. తన అనుభవం గురించి ఆమె అనర్గళమైన ఇంగ్లీషులో మాట్లాడుతూ.. “నా మునుపటి కార్పొరేట్ ఉద్యోగం కంటే దీనిలో ఆదాయం ఎక్కువగానే ఉంది. అంతకంటే ముఖ్యంగా నాకు సమయ స్వేచ్ఛ దొరుకుతోంది; మా అమ్మకు దగ్గరగా ఉండగలుగుతున్నాను” అని తెలిపింది.
ఆమె అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి చాలా మంది ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారని, పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండే ఈ వృత్తిలో తాను అనేక ప్రశ్నలను, సందేహాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె పంచుకుంది.
ఈ పరిచయాన్ని పంచుకుంటూ తన్వి ఇలా రాసుకొచ్చింది.. “జనాలు ఏమనుకుంటారనే దాని గురించి ఆమె బాధపడలేదు. స్వేచ్ఛను, స్వాలంబనను, తన జీవితాన్ని తానే నడిపించుకోవడాన్ని ఆమె ఎంచుకుంది. ధైర్యం అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద పనులు చేయడం మాత్రమే కాదు; ‘నాకు ఇదే కావాలి, నేను దీన్నే ఎంచుకుంటాను’ అని గట్టిగా నిలబడటం కూడా” అని పేర్కొంది.
2.5 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించిన ఈ వీడియో, సమాజపు అంచనాలను దాటి తన తల్లి కోసం, తన స్వేచ్ఛ కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ మహిళపై నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

Leave a Reply