“సుఖప్రసవమే కావాలి.. మరికొంత సమయం వేచి చూద్దాం” అంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. చివరకు ప్రసవం జరిగినప్పటికీ.. ఆరు నెలల తర్వాత బిడ్డకు ఎదురైన సమస్య చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు అత్యవసర సిజేరియన్ చేయాలని సూచించినప్పటికీ.. కొందరు కుటుంబ సభ్యులు మాత్రం “సహజ ప్రసవమే కావాలి” అంటూ పట్టుబడుతుంటారు. అయితే వైద్యపరంగా అవసరమైన సమయంలో చికిత్స ఆలస్యం చేయడం వల్ల బిడ్డకు తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సోనియా గుప్తా తన వైద్య అనుభవానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె ఒక ప్రసవ ఘటన గురించి వివరించారు.
ప్రసవ సమయంలో బిడ్డ కిందకు దిగడం లేదని, అదే సమయంలో బిడ్డ గుండె స్పందన కూడా తగ్గుతోందని వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులకు వివరించారు.
“మరింత ఆలస్యం చేస్తే బిడ్డ మెదడుకు అందే ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా సిజేరియన్‌కు అంగీకరించండి” అని వైద్యురాలు కుటుంబ సభ్యులకు సూచించారు.
అయితే కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించలేదు.
“మా కుటుంబంలో అందరికీ సహజ ప్రసవమే జరిగింది. మరో 10–15 నిమిషాలు ప్రయత్నించండి.. సిజేరియన్ వద్దు” అంటూ పట్టుబట్టినట్లు వైద్యురాలు తెలిపారు.
చివరకు కొంత సమయం తర్వాత సహజ ప్రసవం జరిగింది. అయితే పుట్టిన బిడ్డ వెంటనే ఏడవలేదు. కొంత సమయం తర్వాతే బిడ్డ ఏడవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని భావించి ఇంటికి వెళ్లిపోయారు.
కానీ అసలు సమస్య ఆరు నెలల తర్వాత బయటపడింది.
ఆరు నెలల తర్వాత తల్లిదండ్రులు మళ్లీ వైద్యురాలి వద్దకు వచ్చారు. “బిడ్డకు ఆరు నెలలు వచ్చినా ఇంకా మెడ నిలబడటం లేదు. కూర్చోలేకపోతోంది. ఎవరో దిష్టి పెట్టారేమో” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే వైద్య పరీక్షల్లో దీనికి దిష్టి కారణం కాదని, ప్రసవ సమయంలో ఏర్పడిన ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగి ఉండే అవకాశం ఉందని వైద్యురాలు వివరించారు. దీనివల్ల సెరిబ్రల్ పాల్సీ (Cerebral Palsy) లేదా అభివృద్ధి ఆలస్యం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ప్రసవ సమయంలో బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే మెదడు సంబంధిత సమస్యలు వెంటనే బయటపడకపోవచ్చు. బిడ్డ పెరుగుతున్న కొద్దీ మెడ నిలబెట్టుకోలేకపోవడం, కూర్చోవడంలో ఆలస్యం, నడకలో ఆలస్యం వంటి అభివృద్ధి సమస్యల రూపంలో తర్వాత కనిపించవచ్చు.
అందుకే “సుఖప్రసవం కావాలనేది మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటమే అసలు లక్ష్యం కావాలి” అని డాక్టర్ సోనియా గుప్తా సూచించారు.
ప్రసవ విధానం ప్రతి గర్భిణికి ఒకేలా ఉండదు. తల్లి, బిడ్డ పరిస్థితిని బట్టి వైద్యులు సహజ ప్రసవం లేదా సిజేరియన్‌ను సూచిస్తారు. కాబట్టి ప్రసవ సమయంలో వైద్యులు అత్యవసరంగా సూచించే చికిత్సపై కుటుంబ సభ్యులు వైద్య కారణాలను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.

Leave a Reply