బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో అరటిపండ్లు, క్యాబేజీలను దొంగిలించాడనే ఆరోపణతో ఒక వ్యక్తిని స్థానికులు పట్టుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
కరువా గ్రామంలోని ఒక పొలంలో పంటను కోసి బుట్టలో వేసుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని ఆ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడ గుమిగూడిన కొందరు వ్యక్తులు అతడిని పట్టుకుని, తాళ్లతో చెట్టుకు కట్టేసినట్లు సమాచారం.
ఆ తర్వాత చెట్టుకు కట్టేసిన ఆ వ్యక్తిని కొందరు చితకబాదినట్లు కూడా తెలిసింది. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా పొలాల్లో అరటిపండ్లు, క్యాబేజీలు చోరీకి గురవుతుండటంతో రైతులు కాపలా కాస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న డయల్ 112 పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న వ్యక్తిని స్థానికుల నుంచి విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు అతడిని విచారించారు. అతడు నిజంగానే పంటలను దొంగిలించాడా? గతంలో జరిగిన చోరీలతో అతనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో ఆ వ్యక్తిని పోలీసులు విడిచిపెట్టినట్లు కొన్ని స్థానిక వార్తల ద్వారా తెలుస్తోంది. చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో వాస్తవికతపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కూరగాయల దొంగతనం ఆరోపణలు, దాడికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడికానున్నాయి.

Leave a Reply