3 గంటల్లో ఇస్తామన్నారు.. కానీ 4 వారాలైంది.. మొబైల్ ఫోన్ కోసం పాకిస్థాన్ ప్రభుత్వంతో పోరాడుతున్న మహ్మద్ రిజ్వాన్.. చేతులెత్తేసిన కోర్టు.. ఇంతకీ ఆ ఫోన్‌‌లో ఏం రహస్యం ఉందో..?

క్రికెట్ మైదానంలో బంతిని ఎదుర్కోవడం కంటే, ఇప్పుడు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు తన సొంత మొబైల్ ఫోన్‌‌ను తిరిగి పొందడమే అతిపెద్ద సవాలుగా మారింది!

గత ఆగస్టు 31వ తేదీన ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ముగిసి, పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన ఆ ఉత్కంఠభరిత పరిస్థితుల్లో.. నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) అధికారులు రిజ్వాన్‌ను సంప్రదించారు.

“ఒక చిన్న విచారణ ఉంది.. మీ ఫోన్ ఇవ్వండి, సరిగ్గా 3 గంటల్లో తిరిగి ఇచ్చేస్తాం” అని అధికారులు హామీ ఇచ్చారు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు చట్టపరంగా తన మొబైల్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, విచారణకు పూర్తి సహకారం అందించాలనే సదుద్దేశంతో రిజ్వాన్ తన ఫోన్ పాస్‌వర్డ్‌ను కూడా వారితో పంచుకున్నాడు.

కానీ, ఆ ‘3 గంటలు’ కాస్తా నాలుగు వారాలు దాటినా ఇంకా ముగియని సుదీర్ఘ నిరీక్షణగానే కొనసాగుతోంది! ఓపిక నశించిన రిజ్వాన్ చివరకు కోర్టు మెట్లెక్కాడు. “నాపై విచారణ జరిపే అధికారం ఈ సంస్థకు లేదు” అంటూ లాహోర్ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ఇటీవల కొట్టివేయబడింది. అయితే, న్యాయస్థానం ఒక కీలక ఆదేశం జారీ చేసింది. “రిజ్వాన్ విచారణకు పూర్తిగా సహకరించాలి. అదే సమయంలో, దర్యాప్తు సంస్థ అతడిని అనవసరంగా తిప్పించుకోవడం గానీ, వేధించడం గానీ చేయకూడదు. మొబైల్ తిరిగి పొందేందుకు ఆయన సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చు” అని స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలు వచ్చి రెండు వారాలు గడిచినా, అధికారుల వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో సహనం కోల్పోయిన రిజ్వాన్, ఇప్పుడు నేరుగా NCCIA సంస్థకే ఒక ఘాటైన లేఖ రాశాడు.

ఆ లేఖలో ఆయన సంధించిన ప్రశ్నలు చాలా తీవ్రంగా ఉన్నాయి. “ఇంతకీ నాపై ఏం కేసు పెండింగ్‌లో ఉంది? ఏ ఘటనపై నన్ను విచారిస్తున్నారు? నేను ఎప్పుడు, ఎందుకు మీ ముందు హాజరు కావాలో ముందుగా రాతపూర్వకంగా స్పష్టంగా చెప్పండి!” అని డిమాండ్ చేశాడు. తాను స్వచ్ఛందంగా ఫోన్ అప్పగించిన విషయాన్ని, ఇప్పటివరకు అందించిన సహకారాన్ని గుర్తుచేస్తూ.. “నేను నిజాయితీగా సహకరిస్తున్నప్పుడు, దర్యాప్తు సంస్థ కూడా అంతే నిజాయితీగా వ్యవహరించాలి. వెంటనే నా మొబైల్ నాకు తిరిగి ఇవ్వాలి” అని కరాఖండిగా కోరాడు.

నాలుగు వారాలుగా దర్యాప్తు సంస్థ ఆధీనంలో ఉన్న ఆ మొబైల్‌లో అసలు ఏముంది? రిజ్వాన్ ప్రశ్నలకు NCCIA సమాధానం ఇస్తుందా? లేక ఈ మొబైల్ మిస్టరీ మరో మలుపు తిరుగుతుందా? అనేది వేచి చూడాల్సిందే!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *