కుటుంబాన్ని పోషించుకోవడానికి 70 ఏళ్ల వయసులోనూ రోజుకు 8 కిలోమీటర్లు నడుస్తూ బెలూన్లు అమ్ముతున్న ఓ వృద్ధుడి హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో విడుదలై అందరినీ కలిచివేస్తోంది.
‘సమీర్ కాకా’ అనే ఆ వృద్ధుడే తన కుటుంబానికి ఏకైక ఆధారం. ప్రతిరోజూ తాను ఉంటున్న అద్దె ఇంటి నుంచి 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి బెలూన్లు అమ్మి, తిరిగి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి రావడం ఆయన దినచర్య.
గత 26 ఏళ్లుగా బెలూన్లు అమ్ముతున్న ఈయన, గతంలో పక్షవాతానికి గురై దాని నుంచి కోలుకున్నారు. దీనివల్ల ఆయన మెడ నిటారుగా నిలబడదు. అంతేకాకుండా, కాళ్లకు వచ్చిన తీవ్రమైన చర్మ వ్యాధి, నొప్పి కారణంగా కాళ్లను ఈడ్చుకుంటూ చాలా నెమ్మదిగా నడుస్తారు.
ఇన్ని శారీరక బాధలు ఉన్నప్పటికీ, మండే ఎండలో సైతం రోజుకు 6 గంటలకు పైగా వీధివీధినా తిరుగుతూ బెలూన్లు అమ్మే ఈయనకు.. రోజుకు కేవలం 150 రూపాయలు మాత్రమే ఆదాయం లభిస్తోంది.
ఐదుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంతటి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తున్న ఈ వృద్ధుడి వీడియో చూసిన నెటిజన్లు.. ఆయన కష్టాన్ని, అంకితభావాన్ని చూసి చలించిపోతూ ఆ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Leave a Reply