“డబ్బులు ఇస్తే ఏదైనా జరుగుతుందా?” అనే అనుమానం కలిగించేలా మధ్యప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఏకంగా ఓ మనిషికి బదులుగా గాడిద పేరుతో, గాడిద ఫొటోతో నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ ఆన్లైన్ పోర్టల్లో సర్టిఫికెట్లను ఎలా పరిశీలించి జారీ చేస్తున్నారో పరీక్షించేందుకు NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి పర్మార్ ఓ సదుద్దేశపూర్వక పరీక్షా దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం.
ఆ దరఖాస్తులో ఆయన నమోదు చేసిన వివరాలు చూస్తే.. ఈ వ్యవహారం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందని చెబుతున్నారు.
దరఖాస్తుదారు పేరు ఉండే చోట ‘డాంకీ’ (గాడిద) అని నమోదు చేసి, ఫొటో స్థానంలో నిజమైన గాడిద ఫొటోను అప్లోడ్ చేశారు. తండ్రి పేరు స్థానంలో ‘డాంకీ ఫాదర్’, తల్లి పేరు ‘డాంకీ మదర్’, కుల ధ్రువీకరణ వివరాల్లో ‘యానిమల్’ అని నమోదు చేశారు.
అంతేకాదు.. పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల వివరాలు, రోల్ నంబర్, చిరునామా తదితర వివరాలన్నింటిలోనూ కల్పిత సమాచారాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. శిక్షణా కేంద్రం వివరాల్లో భోపాల్లోని ఓ ప్రముఖ నర్సింగ్ కాలేజీ, ఆసుపత్రి పేరును నమోదు చేసినట్లు సమాచారం.
ఇంత స్పష్టంగా తప్పుడు వివరాలు ఉన్నప్పటికీ.. ఆన్లైన్ పోర్టల్ ఆ దరఖాస్తును తిరస్కరించలేదని ఆరోపించారు.
అంతేకాదు.. దరఖాస్తు రుసుము రూ.2,050 చెల్లించిన కొద్ది నిమిషాల్లోనే ఆ నకిలీ దరఖాస్తుకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆన్లైన్లో జారీ అయినట్లు రవి పర్మార్ వెల్లడించారు.
ఈ ఘటనపై రవి పర్మార్ స్పందిస్తూ.. ఇది కేవలం సాంకేతిక లోపంగా చూడలేమని అన్నారు. నర్సింగ్ కౌన్సిల్ విశ్వసనీయతతో పాటు, రోగుల భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని ప్రశ్నించారు.
“గాడిద ఫొటోతో దరఖాస్తు చేసినా నిమిషాల్లో సర్టిఫికెట్ వస్తే.. అసలైన నర్సులు, ఇతర అభ్యర్థుల పత్రాలను ఎలా పరిశీలిస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై స్వతంత్ర సాంకేతిక, పరిపాలనా దర్యాప్తు నిర్వహించాలని.. దర్యాప్తు ఫలితాలను ప్రజలకు వెల్లడించాలని NSUI డిమాండ్ చేసింది.
ఈ ఘటన నిజంగా వ్యవస్థలోని లోపమా? లేక సాంకేతిక సమస్య కారణంగా జరిగినదా? అనే అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply