మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలోని నవజాత శిశువుల ఐసియూ (ICU) విభాగంలో గత నెలలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి చెందిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ తాజాగా బయటపడ్డాయి.
గత ఆగస్టు 24న తెల్లవారుజామున 2:50 గంటల సమయంలో వెంటిలేటర్లో సంభవించిన పేలుడు కారణంగా ఈ భయానక అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరగడానికి ముందు అలారం మూడుసార్లు మోగడంతో పాటు రెడ్ లైట్లు కూడా వెలిగాయి. అయితే, ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన ఇద్దరు నర్సులు ఆసుపత్రి లాబీలో నిద్రపోతున్నట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెలుగులోకి వచ్చింది. పేలుడు శబ్దం విని ఉలిక్కిపడి లేచిన నర్సులు కేకలు వేయడంతో, ఇతర సిబ్బంది పరుగున వచ్చి చిన్నపాటి అగ్నిమాపక పరికరాల (ఫైర్ ఎక్స్టింగ్విషర్లు) సహాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో భద్రత మరియు అగ్నిమాపక సౌకర్యాలు చాలా దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ సహాయ మంత్రి డాక్టర్ సునీల్ దేశ్ముఖ్ ఆరోపించారు. తెల్లవారుజామున 2:50 గంటలకు ప్రమాదం జరిగితే, ఫైర్ ఇంజిన్ ఉదయం 3:30 గంటలకు మాత్రమే వచ్చిందని ఆయన తెలిపారు.
ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పటికీ, ఆ నివేదికను ఇప్పటివరకు ప్రజల ముందుకు తీసుకరాకపోవడాన్ని ప్రశ్నిస్తూ, ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply