భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనల గురించి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ఫోర్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులపై నిర్వహించిన ఈ సర్వేలో, 15 శాతం మంది తీవ్రమైన డిప్రెషన్ (కుంగుబాటు), ఆందోళనతో బాధపడుతున్నారని, 9 శాతం మందికి ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని అంగీకరించారు. అయితే, వీరిలో కేవలం 9 శాతం మంది మాత్రమే అధికారులను ఆశ్రయించి సహాయం కోరుతున్నట్లు తేలింది (అంటే అత్యధిక శాతం మంది తమ సమస్యను బయటపెట్టడం లేదు).
చదువుల ఒత్తిడి మాత్రమే కాకుండా.. కుల, లింగ వివక్ష, భాషా సమస్యలు, ప్రొఫెసర్ల అమర్యాదపూర్వక వైఖరి విద్యార్థుల మానసిక క్షోభకు ప్రధాన కారణాలుగా ఈ సర్వే పేర్కొంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన 34 శాతం మంది విద్యార్థులు క్యాంపస్లో తమను తాము ‘పరాయివారిగా’ (Alienated) భావిస్తున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా, వైద్య విద్యార్థులకు ఉంటున్న సుదీర్ఘ పని వేళలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, హాస్టళ్లలో అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు విద్యార్థులను మానసికంగా మరింత బలహీనపరుస్తున్నాయని నివేదిక తెలిపింది.
దాదాపు 32 శాతం విద్యాసంస్థల్లో కనీసం మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ కేంద్రాలే లేవని, కేవలం 56 శాతం మంది విద్యార్థులు మాత్రమే కాలేజీ యాజమాన్యాలపై నమ్మకం ఉంచారని ఈ అధ్యయనంలో తేలింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ఈ టాస్క్ఫోర్స్ తన తుది నివేదికను అక్టోబర్ 31, 2026న సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

Leave a Reply