బీహార్‌లోని గయా జిల్లాలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. మన్పూర్ ప్రాంతంలో 50 ఏళ్ల చెవిటి, మూగ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
రైల్వే ట్రాక్‌కు సమీపంలోని ఆమె ఇంట్లో మహిళ మృతదేహం నగ్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలిని తుంగి దేవిగా గుర్తించారు. ఆమె భర్త కృష్ణ సావో గతంలోనే మృతి చెందడంతో, ఆమె ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు పిల్లలు కూడా లేరని సమాచారం.
చెవిటి, మూగ కావడంతో తనకు జరిగిన విషయాన్ని బయటకు చెప్పే పరిస్థితి కూడా ఆమెకు లేదని స్థానికులు తెలిపారు.
పోలీసుల ప్రకారం.. మహిళ తలకు తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇంట్లో రక్తపు మరకలు కూడా కనిపించాయి. గ్యాస్ సిలిండర్‌తో ఆమెపై దాడి చేసి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదే సమయంలో, ఆమెపై లైంగిక దాడి జరిగిందా? ఆ తర్వాత హత్య చేశారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదు.
ఒంటరిగా జీవిస్తున్న మహిళను ఇంట్లో ఒంటరిగా నిద్రించవద్దని కుటుంబ సభ్యులు, స్థానికులు గతంలోనే సూచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. మహిళ మృతికి అసలు కారణం ఏమిటి? ఆమెపై ఎవరు దాడి చేశారు? అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె మృతికి పూర్తి కారణం, లైంగిక దాడి జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Leave a Reply