కేరళ రాష్ట్రం కొల్లం సమీపంలోని చడయమంగళం, అరూర్ ప్రాంతానికి చెందిన మహిళ అశ్వతి (49). ఆమె ఇంట్లో ఆమె 69 ఏళ్ల తల్లి రాధామణి నివసిస్తోంది.
అశ్వతికి అమృత (18) అనే కుమార్తె ఉంది. కుటుంబ ఆస్తిని పూర్తిగా తన పేరున రాయాలని డిమాండ్ చేస్తూ, తల్లి రాధామణితో అశ్వతి తరచూ దౌర్జన్యంగా గొడవపడుతూ ఉండేది.
ఘటన జరిగిన రోజు ఆస్తి వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో, తల్లి రాధామణిని బలవంతంగా ఇంట్లోంచి గెంటివేసేందుకు అశ్వతి ప్రయత్నించింది. దానికి ఆమె నిరాకరించడంతో, తన 18 ఏళ్ల కూతురు అమృత సహాయంతో మరుగుతున్న వేడినీళ్లను తెచ్చి సొంత అమ్మమ్మ రాధామణి పై పోశారు.
వేడినీళ్లు శరీరంపై పడటంతో నొప్పితో విలవిలలాడిన వృద్ధురాలు రాధామణిని, ఇరుగుపొరుగు వారు వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం చడయమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటన తర్వాత తల్లి అశ్వతి, కూతురు అమృత అక్కడి నుంచి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని తీవ్రంగా గాలించిన చడయమంగళం పోలీసులు, మనవరాలు అమృతను నాటకీయంగా అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో “మా అమ్మ చెప్పబట్టే నేను అమ్మమ్మపై వేడినీళ్లు పోశాను” అని అమృత సంచలన వాంగ్మూలం ఇచ్చింది. పరారీలో ఉన్న తల్లి అశ్వతి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply