మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో, మద్యం బాటిళ్లతో వెళ్తున్న ఒక మినీ ట్రక్ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.
అస్సాంకు చెందిన ఆ వాహనంలో మద్యం బాటిళ్లు ఉన్నాయని తెలియగానే, స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి ఆ బాటిళ్లను ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
2016 సంవత్సరం నుంచి బీహార్‌లో మద్యం విక్రయం, రవాణా మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది. ఈ నేపథ్యంలో గర్హాట్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
వాహనంలో మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయం దావానలంలా వ్యాపించింది. వార్త తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహిళలు, చిన్నపిల్లలు, పురుషులు అంతా ఒకరితో ఒకరు పోటీ పడుతూ మద్యం బాటిళ్లను, అట్టపెట్టెలను ఎత్తుకెళ్లడం రికార్డైంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే బాటిళ్లన్నీ మాయమయ్యాయి. దీనిపై సదర్ ఎస్డిపిఓ సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘సీసీటీవీ మరియు సోషల్ మీడియా వీడియోలను పరిశీలించి, బాటిళ్లను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించే పని మొదలైంది. ఈ లూటీకి పాల్పడిన వారందరినీ అరెస్టు చేస్తాం’ అని తెలిపారు.
ఈ వాహనం అస్సాం లేదా పశ్చిమ బెంగాల్ నుంచి సీమాంచల్ మీదుగా బీహార్‌లోకి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాణిగంజ్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి ఈ ఘటనపై తీవ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply