ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.! “హెలికాప్టర్ నుంచి వేసిన ఆహార పొట్లం తలపై పడి వృద్ధుడి మృతి”. హెలికాప్టర్ గాలి వేగానికి మిద్దె పైనుంచి ఎగిరిపడిన పిల్లల తల్లి. షాకింగ్ వీడియో.!

బీహార్ రాష్ట్రం సారణ్ (Saran) జిల్లా పరశురాంపూర్ గ్రామంలో వరదల కారణంగా ప్రజల సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో, రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయి ఆ గ్రామం ఒక ద్వీపంలా మారిపోయింది.

ఈ కారణంగా, వరద బాధితులకు వాయుసేన హెలికాప్టర్ల ద్వారా గగనతలం నుంచి పొడి ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఆహారం కోసం గ్రామస్తులంతా హెలికాప్టర్ రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆ సమయంలో, హెలికాప్టర్ నుంచి కిందకు వేసిన ఆహార పొట్లాలు ఊహించని విధంగా ఇంటి బయట కూర్చున్న అనిల్ కుమార్ సింగ్ (60) అనే వృద్ధుడిపై పడ్డాయి. అతని తల, ఛాతీ భాగంలో వరుసగా ఆహార పొట్లాలు బలంగా తగలడంతో, ఆయన ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు.

అదే గ్రామంలో మరో విషాద ఘటన కూడా జరిగింది. రంభా దేవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి మిద్దెపై (టెర్రస్) నిలబడి హెలికాప్టర్‌ను చూస్తోంది. అప్పుడు హెలికాప్టర్ చాలా తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల ఏర్పడిన అతివేగపు గాలి ఒత్తిడికి అదుపు తప్పిన ఆ మహిళ, పక్క ఇంటి పైకప్పు మీదకు ఎగిరి పడింది. ఈ ఘటనలో ఆ మహిళకు నడుము భాగంలో తీవ్ర గాయాలు కాగా, ఆమె ఇద్దరు పిల్లల కాళ్లు విరిగిపోయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆహార పొట్లం తగిలి వృద్ధుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురై, మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో పలు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు వారితో చర్చలు జరిపి శాంతింపజేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఛాప్రా సదర్ ఆసుపత్రికి తరలించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన సహాయక సామగ్రే ప్రాణాలు బలితీసుకున్న ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *