కేదార్‌నాథ్ మార్గంలో మరణ భయం.. వృద్ధులను కర్రలతో కొట్టి తలలు పగలగొట్టిన కంచర గాడిదల నిర్వాహకులు.. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎదురైన దారుణం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ పుణ్యక్షేత్ర మార్గంలో, ముంబైకి చెందిన ఇద్దరు వృద్ధులపై కంచర గాడిదల (మ్యూల్స్) నిర్వాహకులు కర్రలతో దారుణంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ముంబైకి చెందిన మంజీ వాడ్జీ వావియా, పంచ్ దామ్జీ పటేల్ అనే ఇద్దరు వృద్ధులు కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి కాలినడకన వెళ్తున్నారు. అక్టోబర్ 1న ‘జంగిల్ చట్టి’ ప్రాంతం సమీపంలో వెళ్తుండగా, మార్గమధ్యంలో కంచర గాడిదలను తీసుకెళ్లడంపై భక్తులకు, జంతువులను నడిపే నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ వాగ్వాదం ముదరడంతో, ముగ్గురు నిర్వాహకులు అకస్మాత్తుగా తమ వద్ద ఉన్న కర్రలతో ఆ ఇద్దరు వృద్ధులపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించారు. దాడి నుంచి తప్పించుకుని తమను తాము రక్షించుకునేందుకు వృద్ధులు ప్రయత్నించినప్పటికీ, వారిని అత్యంత క్రూరంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు వృద్ధుల తలలకు తీవ్ర గాయాలై రక్తం కారింది.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై దావానలంలా వ్యాపిస్తోంది. బాధిత భక్తులు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రుద్రప్రయాగ్ ఎస్పీ నీహారికా తోమర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘కేదార్‌నాథ్ మార్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఎంతమాత్రం సహించేది లేదు. భక్తులపై దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే పని ముమ్మరంగా కొనసాగుతోంది. వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *