గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు తనతో మాట్లాడటం మానేసిందన్న కోపంతో, ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ యువతి తండ్రిని కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
సూరత్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ముఖేష్ నహదా కుమారుడు రిషబ్ నహదా, ఆ వ్యాపారవేత్త కూతురితో ప్రేమలో ఉన్నాడు. అయితే, వారి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఆ యువతి రిషబ్‌తో మాట్లాడటం పూర్తిగా మానేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రిషబ్, అక్టోబర్ 1వ తేదీన తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ వ్యాపారవేత్త ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఆ యువతి లేకపోవడంతో, రిషబ్ ఆమె తండ్రితో వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం ముదరడంతో, ఆ ముగ్గురూ తుపాకీతో బెదిరించి ఆ వ్యాపారవేత్తను కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్ది గంటల్లోనే సిటీ లైట్ ప్రాంతంలో వ్యాపారవేత్తను రక్షించి, కిడ్నాప్‌కు పాల్పడిన ముగ్గురినీ అరెస్టు చేశారు. విచారణలో రిషబ్ నహదా మరియు అతని స్నేహితులు దేవ్ కేతన్ అహిర్, లక్ష్మణ్ రాథోడ్ వద్ద నుంచి ₹41.40 లక్షల విలువైన వస్తువులతో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన మిగతా ఇద్దరిపై ఇప్పటికే నేర కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ప్రియురాలు మాట్లాడటం లేదని కోపంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేసిన ఘటన, పోలీసుల అత్యంత వేగవంతమైన చర్య సూరత్ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.

Leave a Reply