ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలోని కుమావున్ విశ్వవిద్యాలయానికి చెందిన డీఎస్‌బీ (DSB) క్యాంపస్‌లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన భాను ప్రతాప్ సింగ్ చౌహాన్ అధ్యక్ష పదవిలో విజయం సాధించాడు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మద్దతు ఉన్న శుభమ్ కుమార్‌ను ఆయన 482 ఓట్ల తేడాతో ఓడించాడు. భానుకు 1,355 ఓట్లు రాగా, శుభమ్‌కు 873 ఓట్లు వచ్చాయి. మూడో అభ్యర్థి హిమాన్షు ఆర్యకు 283 ఓట్లు దక్కాయి.
ఈ విజయం వెనుక భాను తల్లి బీనా చౌహాన్ కృషి కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ 10వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న ఆమె, తన కుమారుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కావాలనే కలను నెరవేర్చడం కోసం అదే కాలేజీలో పొలిటికల్ సైన్స్ (రాజకీయ శాస్త్రం) పీజీలో చేరింది. కాలేజీలో తోటి విద్యార్థినిగా ఉంటూనే కుమారుడి కోసం నిరంతరం ప్రచారం చేసి, విద్యార్థినుల మద్దతు కూడగట్టింది.
తన కౌన్సిలర్ ఎన్నికల సమయంలో కుమారుడు భాను రాత్రింబవళ్లు కష్టపడ్డాడని, ఇప్పుడు కొడుకు కోసం ఓ తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని బీనా తెలిపింది. ఎన్నికల ప్రచార సమయంలో భాను, అతని తల్లి కాలేజీకి సంబంధం లేని బయటి వారని ప్రత్యర్థులు ఆరోపించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు భానుకు 1,355 ఓట్లు వేసి గెలిపించడం ద్వారా ఆ ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చారని బీనా పేర్కొంది.
మిగిలిన ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో కూడా విజేతలను ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా కమల్ కర్కి, విద్యార్థినుల కోటాలో జాయింట్ సెక్రటరీగా అనుష్క పూరి, కోశాధికారిగా సృష్టి రావత్ విజయం సాధించారు. బాలుర ఉపాధ్యక్షుడిగా అభిషేక్ రైగుని, బాలికల ఉపాధ్యక్షురాలిగా కుంకుమ్ జోషి ఎన్నికయ్యారు. సాంస్కృతిక కార్యదర్శిగా హర్షిత్ జోషి గెలుపొందాడు.

Leave a Reply