ఢిల్లీకి చెందిన మాజీ జిమ్ ట్రైనర్ అజయ్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గతంలో జిమ్ నడుపుతున్న ఆయన, సుమారు 2 ఏళ్ల క్రితం దానిని మూసివేసి నోయిడాలో ఒక బిల్డర్, వ్యాపారవేత్త వద్ద బౌన్సర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కొన్నిసార్లు కారు డ్రైవర్‌గా కూడా పనిచేసేవాడు.
సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన అజయ్, దారిలో తాను వెళ్తున్న ఆటో ఫోటోను భార్యకు పంపించాడు. అలాగే, దారిలో ఒక దుకాణంలో నీళ్లు, స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు కూడా ఆ ప్రదేశం ఫోటోను భార్యకు పంపించినట్లు చెబుతున్నారు. తన లొకేషన్‌ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్న సమయంలో, రాత్రి 11.22 గంటల ప్రాంతంలో అతని సెల్ ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయింది.
ఆ తర్వాత అజయ్‌ను సంప్రదించడం సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. సెప్టెంబర్ 26వ తేదీన అతను కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా, ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్ సమీపంలో ఉన్న మురుగునీటి కాలువ వద్ద గుర్తుతెలియని పురుషుడి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
అక్టోబర్ 1వ తేదీన ఆ మృతదేహం అజయ్దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అతని శరీరం, మెడ భాగంలో గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతడిని హత్య చేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతను చివరగా ఎవరిని కలిశాడు, ఎక్కడికి వెళ్లాడు, అతనితో ఉన్నవారు ఎవరు అనే తదితర పలు కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply