ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేవరియా ప్రాంతానికి చెందిన ఆర్మీ సుబేదార్ మేజర్ సత్యవాన్ సింగ్ మృతి చెందడంతో, ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంతూరికి తరలిస్తుండగా జరిగిన ఘోర ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టింది.
హర్యానాలోని పంచకుల నుంచి సత్యవాన్ సింగ్ మృతదేహాన్ని తీసుకుని, ఆయన ఏకైక కుమారుడైన 18 ఏళ్ల గౌరవ్ సింగ్, సోదరుడు రామ్ సముజ్ మరియు బంధువు రాజన్ అంబులెన్స్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. వారి కుటుంబంలోని ఇతర సభ్యులు మరో వాహనంలో వారిని అనుసరిస్తూ వస్తున్నారు.
ప్రయాణంలో భాగంగా అయోధ్య – సుల్తాన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలోని హలియాపూర్ సమీపంలోకి రాగానే, ఊహించని విధంగా వేగంగా వచ్చి అదుపుతప్పిన అంబులెన్స్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్‌తో పాటు సుబేదార్ మేజర్ కుమారుడు గౌరవ్ సింగ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనం శిథిలాల మధ్య ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి బయటకు తీశాయి.
తీవ్రంగా గాయపడిన రామ్ సముజ్, రాజన్‌లను వెంటనే అయోధ్యలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వారు కూడా కన్నుమూశారు. ఆర్మీ జవాను మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్న అదే ప్రయాణంలో.. ఆయన కుమారుడు, సోదరుడు, బంధువు ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరుసగా ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, రోదనలను మిగిల్చింది.

Leave a Reply