అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో జరిగిన పాత వస్తువుల అమ్మకంలో కేవలం 30 డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 2,500) కొనుగోలు చేసిన ఒక చిన్న పెయింటింగ్ ఇప్పుడు ఏకంగా రూ. 11.3 కోట్లకు వేలంలో అమ్ముడుపోయింది.
సాధారణంగా పడి ఉన్న ఆ పెయింటింగ్ వెనుక ఎన్నో ఏళ్ల నాటి అద్భుతమైన కళా చరిత్ర దాగి ఉందని తెలియడంతో దాని విలువ ఒక్కసారిగా అనేక రెట్లు పెరిగింది.
పాత వస్తువులు, ఫర్నిచర్‌ను కొని విక్రయించే ఒక వ్యక్తి మిచిగాన్‌లో జరిగిన పాత వస్తువుల అమ్మకానికి (గ్యారేజ్ సేల్‌కు) వెళ్లినప్పుడు, కారు పార్కింగ్ స్థలానికి వెళ్లే దారిలో దుమ్ము పట్టి ఉన్న ఒక చిన్న పెయింటింగ్‌ను చూశాడు. సుమారు 8×11 అంగుళాల పరిమాణంలో ఉన్న ఆ పెయింటింగ్‌లో ఆల్చిప్పలను (oysters) అందంగా గీసి ఉన్నాయి. దాని కళాత్మకత నచ్చడంతో అతను కేవలం 30 డాలర్లు ఇచ్చి దానిని కొనుగోలు చేశాడు.
దానిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ పెయింటింగ్ గురించి ఆరా తీయగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది 1951లో చికాగోకు చెందిన ప్రముఖ చిత్రకారిణి గెర్ట్రూడ్ అబర్‌క్రోంబీ (Gertrude Abercrombie) వేసిన “ఆల్డర్‌మెన్ మెరియమ్స్ ఆయిస్టర్స్” (Alderman Merriam’s Oysters) అనే పెయింటింగ్‌గా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ప్రజల కంటికి కనిపించకుండా పోయిన ఈ పెయింటింగ్‌ను, గతంలో వైద్య చికిత్స కోసం ఫీజుకు బదులుగా ఓ వైద్యుడికి ఇచ్చినట్లు సమాచారం.
ఆర్ట్ మ్యూజియం రికార్డులు, కళా చరిత్ర నిపుణుడి ధృవీకరణ తదితర ఆధారాలతో ఆ పెయింటింగ్ అసలైనదేనని అధికారులు నిర్ధారించారు. అనంతరం ఫ్రీమ్యాన్స్ (Freeman’s) వేలం సంస్థ ద్వారా ఆ పెయింటింగ్ వేలానికి వచ్చింది. ప్రారంభంలో ఇది 1.5 లక్షల నుంచి 2.5 లక్షల డాలర్ల వరకు ధర పలుకుతుందని అంచనా వేసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్ట్ కలెక్టర్లు పోటీపడటంతో చివరికి 13,52,600 డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 11.3 కోట్లకు) అమ్ముడుపోయింది. కేవలం రూ. 2,500 పెట్టుబడి సుమారు 45,000 రెట్లు పెరిగిన ఈ ఘటన, కళాఖండాల వేలం ప్రపంచంలో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

Leave a Reply