రైలు ప్రయాణాలు ఎల్లప్పుడూ సురక్షితమైనవి మరియు ప్రశాంతమైనవిగా భావిస్తుంటారు; కానీ, కదులుతున్న రైలులోకి అకస్మాత్తుగా ఒక విషసర్పం దూరితే అక్కడున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
అలాంటి ఓ భయానక ఘటనే రైలులో ప్రయాణిస్తున్న వారికి ఎదురైంది. రైలు సీటు ప్యానెల్స్లోకి అకస్మాత్తుగా దూరిన ఓ పామును చూసి, బోగీలోని ప్రయాణికులంతా భయంతో కేకలు వేసుకుంటూ పరుగులు తీసిన ఘటన తీవ్ర కలకలం, భయాందోళనలు సృష్టించింది.
రాత్రి పూట ప్రయాణికులంతా తమ తమ సీట్లలో ప్రశాంతంగా విశ్రమిస్తున్న సమయంలో, సీటు పక్కన ఉన్న ప్యానెల్ మధ్యలో ఏదో పాకుతున్నట్లు శబ్దం వినిపించింది. అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు నిశితంగా గమనించగా, అక్కడ ఒక పొడవైన పాము నెమ్మదిగా లోపలికి వెళ్లడాన్ని చూసి వారు షాక్కు గురయ్యారు.
క్షణాల్లో “పాము… పాము…” అంటూ కేకలు వేయడంతో ఆ బోగీ అంతా భయానక వాతావరణం అలుముకుంది. ప్రయాణికులంతా తమ వస్తువులను పట్టుకుని, ప్రాణభయంతో అరుస్తూ పక్క బోగీల వైపు పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, భద్రతా బలగాలు.. ఆ బోగీకి తాళం వేసి ప్రయాణికులను సురక్షితమైన వేరే బోగీకి మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాతి స్టేషన్లో రైలును నిలిపివేసి, ఆ బోగీని పూర్తిగా తొలగించి, ప్రయాణికులందరినీ ప్రత్యామ్నాయ బోగీలో కూర్చోబెట్టి ప్రయాణాన్ని కొనసాగించారు.
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ, రైలు బోగీలోకి పాము ఎలా వచ్చిందనే ప్రశ్న ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తించడంతో పాటు, రైల్వే నిర్వహణ (మెయింటెనెన్స్) పై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

Leave a Reply