అర్ధరాత్రి ఆకాశాన్ని చూసిన వారికి భారీ షాక్.! అకస్మాత్తుగా దూసుకెళ్లిన ప్రకాశవంతమైన అగ్నిగోళం (Fireball). మరుసటి సెకన్లలో ఏం జరిగిందంటే.?

గ్రీన్‌లాండ్‌లోని ఉపెర్నావిక్ (Upernavik) ప్రాంతంలో అర్ధరాత్రి ఆకాశాన్ని చీల్చుకుంటూ అతివేగంగా దూసుకెళ్లిన ఒక ప్రకాశవంతమైన ఉల్క.. గ్రీన్‌లాండ్ విమానాశ్రయ కెమెరాలో రికార్డయ్యింది.

సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి 12:45 గంటల సమయంలో సుమారు 10 సెకన్ల పాటు కనిపించిన ఈ దృశ్యం, కారుచీకటి ఆకాశాన్ని అకస్మాత్తుగా ప్రకాశవంతం చేసింది. ఉల్క దూసుకెళ్తున్నప్పుడు దాని వెలుతురు కింద ఉన్న నీటి ఉపరితలంపై కూడా ప్రతిబింబించినట్లు సమాచారం.

ఆ వీడియోలో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ప్రకాశిస్తున్న ఒక వస్తువు ఆకాశంలో అతివేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సెకన్లలోనే అది కనుమరుగైనప్పటికీ, దాని వెనుక ప్రకాశవంతమైన కాలిబాట (ట్రైల్) లాంటిది కనిపించింది. స్థానిక వార్తా సంస్థల సమాచారం ప్రకారం, ఈ ఉల్క గంటకు కాదు.. సెకనుకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉండొచ్చు. భూ వాతావరణంలో సుమారు 20 నుంచి 40 కిలోమీటర్ల ఎత్తులో ఇది విచ్ఛిన్నమై ఉంటుందని ఆర్హస్ (Aarhus) యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ స్కాట్ తెలిపారు.

అంతరిక్షంలో ఉండే రాయి లేదా దాని చిన్న ముక్క భూ వాతావరణంలోకి అతివేగంగా ప్రవేశించినప్పుడు, గాలి రాపిడి మరియు అధిక పీడనం కారణంగా అది బాగా వేడెక్కి ప్రకాశిస్తుంది. అత్యంత ప్రకాశవంతంగా కనిపించే ఇలాంటి ఉల్కలను సాధారణంగా ‘ఫైర్‌బాల్’ (అగ్నిగోళం) అని పిలుస్తారు. వాటిలోని కొంత భాగం వాతావరణంలో పూర్తిగా కాలిపోకుండా భూమి ఉపరితలాన్ని చేరితే, దాన్ని ఉల్కాపాతం (Meteorite) అంటారు. అయితే, గ్రీన్‌లాండ్‌లో నమోదైన ఈ ఘటనలో ఆ వస్తువుకు సంబంధించిన ఏదైనా భాగం నేలను తాకిందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

ఈ అరుదైన దృశ్యం ఇంటర్నెట్‌లో విడుదల కావడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రకాశవంతమైన ఉల్కలు కనిపిస్తున్నప్పటికీ, అవి ఎల్లప్పుడూ మనుషుల కంటపడటం లేదా కెమెరాల్లో రికార్డ్ కావడం సాధ్యం కాదు. ముఖ్యంగా సముద్రం లేదా జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలపై వెళ్లే ఉల్కలు తరచుగా ఎవరి దృష్టికీ రాకుండానే పోతుంటాయి. ఈ క్రమంలోనే, గ్రీన్‌లాండ్ ఎయిర్‌పోర్ట్ కెమెరాకు చిక్కిన ఈ దృశ్యం ప్రస్తుతం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *