ఇజ్రాయెల్ దాడుల వల్ల ఘోర వినాశనానికి గురైన గాజా నగరం ప్రస్తుత దుస్థితిని తెలియజేసే గూగుల్ ఎర్త్ (Google Earth) శాటిలైట్ చిత్రాలను.. ప్రముఖ అమెరికన్ నటి, చిత్ర నిర్మాత, సామాజిక కార్యకర్త ఏంజెలీనా జోలీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
గూగుల్ ఎర్త్ యాప్ ద్వారా గాజాలో జరిగిన ఘోర వినాశనాన్ని ఇప్పుడు ఎవరైనా ప్రత్యక్షంగా చూడొచ్చని పేర్కొన్న ఆమె, యుద్ధంతో ఛిద్రమైన గాజా నిజ స్వరూపాన్ని హృదయాన్ని కలిచివేసే మాటలతో వివరించారు.
ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, “ఇప్పుడు మీరు ‘గూగుల్ ఎర్త్’ సైట్ ద్వారానే గాజా నగరానికి ఏమైందో నేరుగా చూడవచ్చు. గాజా నగరంలోని అన్ని ప్రాంతాలు శిథిలాలుగా, స్మశానంగా మారిపోయాయి. ఇళ్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, రోడ్లు, మరియు తాగునీరు-పారిశుద్ధ్య వ్యవస్థలు వంటి ప్రజల దైనందిన జీవనానికి ఆధారమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, ఐక్యరాజ్యసమితి శాటిలైట్ సెంటర్ డేటాను ప్రస్తావిస్తూ.. “జూన్ 16, 2026 నాటికి, గాజాలోని మొత్తం భవనాలలో 82 శాతం పూర్తిగా నాశనమయ్యాయి. వాటిలో మూడింట రెండు వంతుల భవనాలు నేలమట్టమయ్యాయనే భయంకరమైన విధ్వంసాన్ని గూగుల్ ఎర్త్ చిత్రాలు స్పష్టంగా చూపుతున్నాయి” అని ఆమె పేర్కొన్నారు.
ఏంజెలీనా జోలీ మరింత ఆవేదనతో చెబుతూ.. “గూగుల్ ఎర్త్ చిత్రాలు కేవలం భవనాల విధ్వంసాన్ని మాత్రమే చూపగలవు. కానీ, ఆ నరకయాతన మధ్య మనుషులు ఎలా జీవిస్తున్నారన్నది గానీ, క్రూరంగా చంపబడిన కుటుంబాలకు ఏం జరిగిందన్నది గానీ, లేదా ప్రాణాలతో బయటపడిన వారి కన్నీళ్లను, బతుకుపోరాటాన్ని గానీ గూగుల్ ఎర్త్ చిత్రాలు ఎప్పటికీ చూపించలేవు” అని హృదయవిదారకంగా పోస్ట్ చేశారు.

Leave a Reply