జపాన్‌లోని హొక్కైడోలో రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు డ్రైవర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది.
సెప్టెంబర్ 29వ తేదీన బిఫుకా ప్రాంతంలో కారు వెళ్తుండగా, రోడ్డు పక్కన రెండు ఎలుగుబంట్లను డ్రైవర్ గమనించాడు. అందులో ఒకటి తల్లి ఎలుగుబంటి కాగా, మరొకటి దాని పిల్ల అని తెలుస్తోంది. మొదట ఆ ఎలుగుబంట్లు కారుకు దూరంగా వెళ్లడంతో, డ్రైవర్ తన కారును నెమ్మదిగా ఆపాడు. కానీ, కొద్ది సెకన్లలోనే పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయింది.
అకస్మాత్తుగా వెనక్కి తిరిగిన తల్లి ఎలుగుబంటి, నేరుగా కారు వైపు పరిగెత్తుకుంటూ వచ్చి కారు ముందు భాగంపైకి దూకింది. ఆ తర్వాత కారు ముందు భాగం (బోనెట్) పైకి ఎక్కి, తన గోళ్లు, పళ్లతో కారుపై దాడి చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా, కారు ముందు భాగాన్ని పలుమార్లు బలంగా కొట్టడంతో వాహనం భారీగా ధ్వంసమైందని చెబుతున్నారు. బోనెట్‌పై గీతలు, సొట్టలు పడటంతో పాటు ఏకంగా ఒక చోట రంధ్రం కూడా పడింది. ఈ ఘటన అంతా కారులోని డాష్‌క్యామ్‌లో రికార్డవ్వగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొద్దిసేపు కారుపై దాడి చేసిన తల్లి ఎలుగుబంటి, ఆ తర్వాత తన పిల్లను తీసుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. తన పిల్లకు ప్రమాదం పొంచి ఉందని భావించడం వల్లే తల్లి ఎలుగుబంటి కారు వైపు అంత ఆవేశంగా దూసుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హొక్కైడోలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
హొక్కైడోలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎలుగుబంట్లకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల గుండా వెళ్లే వాహనదారులు రోడ్డు పక్కన వన్యప్రాణులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ కారు దిగి బయటకు రాకపోవడం వల్లే పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. తన పిల్లను రక్షించుకోవడానికి తల్లి ఎలుగుబంటి కారుపై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

Leave a Reply