ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భార్యతో జరిగిన గొడవ తర్వాత 47 ఏళ్ల ప్రభుత్వ వైద్యుడు సందీప్ సింగ్ మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాన్పూర్ దేహత్ ప్రాంతంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న ఆయన.. నిరాలా నగర్‌లోని బ్లాసమ్ అపార్ట్మెంట్లో తన భార్య కాంచన్, 4 ఏళ్ల కూతురు, చిన్న కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సందీప్ సింగ్ శవమై కనిపించాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకుంది. మృతుడి దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యతో జరిగిన గొడవే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. అయితే, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో, సందీప్ సింగ్ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. అతనికి అప్పటికే వివాహం జరిగిందని, 2018లో మొదటి భార్యతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని బంధువులు తెలిపారు. ఆ వివాహం ద్వారా అతనికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత 2019లో కాస్గంజ్కు చెందిన కాంచన్‌ను సందీప్ సింగ్ రెండో వివాహం చేసుకున్నాడు. రెండో పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విషయాలకే తరచూ మనస్పర్థలు వచ్చేవని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటనకు ముందు తన కుమారుడితో ఫోన్లో మాట్లాడినట్లు సందీప్ సింగ్ తండ్రి రాజ్ బహదూర్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత భార్యతో గొడవ జరగడంతో సందీప్ సింగ్ ఒంటరిగా వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మరణంపై కాన్పూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దంపతుల మధ్య జరిగిన గొడవ మాత్రమే కారణమా లేక మరేదైనా నేపథ్యం ఉందా అనేది విచారణ, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply