రోజురోజుకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. యువత మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా కొత్త టెక్నాలజీని వేగంగా నేర్చుకుంటున్న ఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
వ్యాపారవేత్త ఆయుష్ శుక్లా తన తండ్రికి ఏఐ టూల్స్ ఎలా ఉపయోగించాలో నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆయుష్ తండ్రి సాధారణంగా తనకు సంబంధించిన ముఖ్యమైన లెక్కలు, ఇతర సమాచారాన్ని ముందుగా నోట్‌బుక్‌లో చేతితో రాసుకునేవారు. ఆ తర్వాత వాటిని ఒక్కొక్కటిగా కంప్యూటర్‌లో నమోదు చేసేవారు. దీంతో ఈ పనికి చాలా సమయం పట్టేది.
ఇది గమనించిన ఆయుష్.. చేతితో రాసుకున్న సమాచారాన్ని ఫొటో తీసి, ఏఐ సహాయంతో సులభంగా కంప్యూటర్‌లో టేబుల్ రూపంలోకి మార్చుకోవచ్చని తండ్రికి చెప్పారు.
అందుకు అనుగుణంగా ఆయన మొబైల్‌లో ఏఐ యాప్‌ను ఉపయోగించి.. నోట్‌బుక్‌లో రాసిన పేజీని ఫొటో తీసి, అందులోని సమాచారాన్ని క్రమబద్ధమైన పట్టికగా మార్చమని ఏఐకి సూచించారు.
కొన్ని క్షణాల్లోనే చేతిరాత సమాచారమంతా చక్కటి టేబుల్‌గా మారిపోవడంతో ఆయన తండ్రి ఆశ్చర్యపోయారు.
గతంలో గంటల సమయం పట్టే పనులను.. ఏఐ సహాయంతో కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చని ఆయన అర్థం చేసుకున్నారు.
ఇక అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మూడో రోజుకే ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఏఐ టూల్స్‌ను ఉపయోగించి తన పనులను పూర్తి చేసే స్థాయికి ఆయన చేరుకున్నారని ఆయుష్ తెలిపారు.
తండ్రి ఏఐని నేర్చుకుంటున్న ఈ ఆసక్తికరమైన క్షణాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని.. ఆసక్తి ఉంటే ఎవరైనా ఏఐని నేర్చుకోగలరని ఈ ఘటన నిరూపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply