రాజస్థాన్లోని అల్వార్ పరిధిలో గల సూర్యానగర్లో ఒక యువకుడు బయటకు వెళ్లేందుకు తన షూ తీయగా, అందులో పాము నక్కి ఉండటం వెలుగుచూసింది.
రాత్రి నడక (వాకింగ్) కోసం సిద్ధమైన ఆ యువకుడు, షూ వేసుకునే ముందు లోపలికి చూడగా పాము కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని షూను పరిశీలించగా, అందులో సుమారు 2 అడుగుల పొడవున్న పాము చుట్టచుట్టుకుని పడుకుని ఉంది. ఆ తర్వాత వారు ఆ పామును సురక్షితంగా రక్షించారు. అది విషరహితమైన ‘ట్రింకెట్ స్నేక్’ (Trinket Snake) అని రెస్క్యూ బృందం స్పష్టం చేసింది.
ఈ రకమైన పాములు ఎక్కువగా రాత్రి వేళల్లో చురుగ్గా తిరుగుతాయని, సురక్షితమైన ప్రదేశాల కోసం చూస్తూ షూలు, ఇతర వస్తువులు లేదా మూసివున్న ప్రదేశాలలో దాక్కునే అవకాశం ఉందని వారు తెలిపారు. షూలో పాము ఉన్న విషయం గమనించకుండా కాలికి తొడుక్కుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని, అదృష్టవశాత్తూ ఆ యువకుడు చివరి నిమిషంలో చూసి జాగ్రత్తపడ్డాడని చెప్పారు.
బయట ఉంచిన బూట్లు లేదా చెప్పులను ధరించే ముందు ఎల్లప్పుడూ ఒకసారి సరిచూసుకోవాలని రెస్క్యూ సిబ్బంది సూచించారు. పాములు లేదా ఇతర విషపురుగులు కనిపిస్తే వాటిపై దాడి చేయకుండా వెంటనే రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వాలని కోరారు. షూ లోపలి నుంచి పామును రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply