కుమారుడు, అతని స్నేహితుడు ఏళ్ల తరబడి శారీరకంగా, మానసికంగా వేధించిన కారణంగా మహారాష్ట్రలోని వసాయ్ ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మృతి చెందిన వ్యక్తిని గాబ్రియేల్ డొమినిక్ కౌటిన్హోగా గుర్తించారు. నైగావ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి కుమార్తె రూపా నోయెల్ సిరాయత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన సోదరుడు శ్యామ్ కౌటిన్హో గత 12 నుంచి 13 ఏళ్లుగా తండ్రిని వివిధ కారణాలతో వేధిస్తున్నాడు. సెప్టెంబర్ 26న తలెత్తిన చిన్న వివాదం కారణంగా శ్యామ్ తన తండ్రిపై దాడి చేశాడని, ఆ తర్వాత అతని స్నేహితుడు సాగర్ కూడా వృద్ధుడిని కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, ఆ వృద్ధుడికి తిండి కూడా పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు.
సెప్టెంబర్ 28న తన కుమార్తెను కలిసిన గాబ్రియేల్.. అందులో ముఖ్యమైన పత్రాలు, నగదు ఉన్నాయని చెబుతూ ఒక బ్యాగ్‌ను ఆమె చేతికి ఇచ్చాడు. ఆ తర్వాత నైగావ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూతురు ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా.. కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాసి ఉన్న సూసైడ్ నోట్ కనిపించింది. ఈ వేధింపులకు సంబంధించిన దృశ్యాలని చెబుతున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై భయాందర్ రైల్వే పోలీసులు శ్యామ్ కౌటిన్హో, అతని స్నేహితుడు సాగర్‌లపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (Abetment to suicide) కేసు నమోదు చేశారు. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు, వృద్ధుడి మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Leave a Reply