మధ్యప్రదేశ్‌లో మోమోస్ తింటున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదంలో, ఓ వ్యాపారి ఏకంగా కస్టమర్‌పై మరుగుతున్న నూనెను పోసిన అత్యంత కిరాతక ఘటన తీవ్ర కలకలం రేపింది.
కేవలం రూ. 20 ప్లేట్ మోమోస్‌లో సంఖ్య తక్కువగా ఉండటంపై ప్రశ్నించడమే ఈ దారుణానికి దారితీసింది.
ఆదివారం సాయంత్రం, శివ అనే 18 ఏళ్ల విద్యార్థి తన స్నేహితులతో కలిసి ‘అంకిత్ మోమోస్ కార్ట్’ అనే స్థానిక ఫుడ్ స్టాల్‌కు వెళ్లాడు. అక్కడ రూ. 20 విలువైన మోమోస్ ఆర్డర్ చేయగా, ప్లేట్లో మోమోల సంఖ్య తక్కువగా ఉండటంతో శివ ఆ విషయమై నిర్వాహకుడు అంకిత్‌ను ప్రశ్నించాడు.
దీంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన వ్యాపారి అంకిత్, పొయ్యిపై మరుగుతున్న నూనె మూకుణ్ని అమాంతం ఎత్తి శివపై కుమ్మరించాడు.
మరుగుతున్న నూనె ముఖంపై పడటంతో ఆ విద్యార్థి ముఖం, ఒక వైపు చెవి తీవ్రంగా కాలిపోయాయి. నొప్పితో తీవ్రంగా కేకలు వేసిన బాధితుడిని స్నేహితులు, కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు అంకిత్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేవలం ఒక్క మోమో తక్కువగా ఇచ్చావని అడిగినందుకు యువకుడిపై మరిగే నూనె పోసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.

Leave a Reply