గుజరాత్‌లోని దాహోద్ జిల్లా ధాన్‌పూర్ తాలూకాకు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి బచుభాయ్ ఖాబడ్ నివాసంలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
పిపెరో గ్రామంలోని సదరు ఎమ్మెల్యే నివాసానికి దేవ్‌గఢ్ బరియా మున్సిపాలిటీకి చెందిన అగ్నిమాపక శకటం (ఫైరింజన్) అత్యవసరంగా వెళ్లింది. ఏదో ఘోర ప్రమాదమో లేదా అగ్నిప్రమాదమో జరిగి ఉంటుందని భావించి హుటాహుటిన వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ఊహించని షాక్ తగిలింది! ఫైరింజన్ నీటితో ఎమ్మెల్యే ఇంటి ముందు భాగాన్ని కడిగి శుభ్రం చేయాలంటూ అక్కడున్న ఆయన అనుచరులు హుకుం జారీ చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావడంతో.. ఏదో తీవ్రమైన ఆపద వచ్చిందని భావించిన దేవ్‌గఢ్ బరియా మున్సిపాలిటీ అధ్యక్షుడు గణేష్ కలాల్ ఆదేశాల మేరకు అధికారులు వెంటనే ఫైరింజన్‌ను పంపించారు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాతే అది నకిలీ అత్యవసర కాల్ అని, ఎమ్మెల్యే ఇంటిని శుభ్రం చేయడానికే వాహనాన్ని పిలిపించారని సిబ్బందికి అర్థమైంది.
విషయం తెలుసుకున్న ఫైర్ అధికారి మయూర్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించి, ఇంటిని శుభ్రం చేసే పనిని తక్షణమే ఆపివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, అత్యవసర సేవలందించే ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత పనుల కోసం దుర్వినియోగం చేసినందుకు గాను ఎమ్మెల్యే కుమారుడు బల్వంత్ ఖాబడ్ పేరిట ₹2,700 జరిమానా రసీదు వేసి, ఆ మొత్తాన్ని వసూలు చేశారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన అత్యవసర అగ్నిమాపక వాహనాన్ని స్వంత పనుల కోసం ఎమ్మెల్యే వాడుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఈ వ్యవహారంపై మున్సిపల్ యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది.

Leave a Reply