కార్పొరేట్ కంపెనీలలో ఉండే విపరీతమైన పని ఒత్తిడి, ఉన్నతాధికారుల మితిమీరిన వేధింపులకు సంబంధించిన షాకింగ్ విషయాలు అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్ (Reddit)లో ‘Such_Cauliflower_937’ అనే యూజర్, తన మునుపటి కంపెనీలో తాను ఎదుర్కొన్న విషపూరిత పని వాతావరణం (టాక్సిక్ వర్క్ కల్చర్) గురించి పంచుకున్న వివరాలు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఏదో సాధారణ ఉద్యోగమే కదా అనుకుని చేరిన ఆ ఆఫీసులో, రోజురోజుకూ పనిభారంతో పాటు వేధింపులు, ఆంక్షలు హద్దులు దాటిపోయాయని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడి మేనేజర్లు సాధారణ పర్యవేక్షణతో ఆగకుండా, హై-డెఫినిషన్ (HD) సీసీటీవీ కెమెరాల ద్వారా ఉద్యోగుల కంప్యూటర్ స్క్రీన్లను జూమ్ చేసి మరీ నిఘా పెట్టేవారని ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులు ఎవరితో చాట్ చేస్తున్నారు? స్క్రీన్‌పై ఏం చూస్తున్నారు? అనే వ్యక్తిగత వివరాలను కూడా రహస్యంగా నిఘా వేస్తూ ఆ ఆఫీసును ఒక ‘డిజిటల్ జైలు’లా మార్చేశారని పేర్కొన్నారు. వారంలో ఏడు రోజులూ సెలవు లేకుండా పనిచేయించుకోవడమే కాకుండా, చాలా రోజులు అర్ధరాత్రి 2 గంటల వరకు బలవంతంగా ఆఫీసులోనే ఉంచేవారని వెల్లడించారు.
ఇలాంటి నిరంతర మానసిక వేధింపులతో పాటు, ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా బయట నిలబెట్టడం లాంటి అవమానకర చర్యలతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆ ఉద్యోగి.. చివరకు ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. సాధారణ పద్ధతిలో సైలెంట్‌గా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిపోకుండా.. తనకు జరిగిన అన్యాయాలు, ఆ కంపెనీ అరాచకాలు అన్నింటినీ పూసగుచ్చినట్లు వివరిస్తూ తన విభాగం మొత్తానికి ఒక సంచలన ఈమెయిల్ పంపించారు. ఆ మరుసటి రోజు ఉదయం సిబ్బంది ఎవరూ ఆఫీసుకు రాకముందే తన లగేజీ సర్దుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, నెటిజన్లు ఆ ఉద్యోగి చూపిన తెగువను ప్రశంసిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు.

Leave a Reply